పాల సేకరణను పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి తలసాని ఆదేశం

పాల సేకరణను పెంచేందుకు పశుసంవర్ధక, పశు గణాభివృద్ది, డెయిరీ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పాల సేకరణ పెంపుకు చేపట్టవలసిన చర్యలు, కృత్రిమ గర్బధారణ అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డెయిరీ చైర్మన్ లోక భూమా రెడ్డి, TSLDA చైర్మన్ రాజేశ్వర్ రావు, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, TSLDA ceo మంజు వాణి, డెయిరీ md శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పశుసంవర్ధక, పశు గణాభివృద్ది, డెయిరీ అధికారులతో జిల్లాల వారిగా సమన్వయ కమిటీ లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమన్వయ కమిటీలోని అధికారులు ఆయా శాఖల పరంగా ఉన్న సమస్యలను కూడా అధ్యయనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా డెయిరీలో దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న అధికారులు, సిబ్బందిని 10 రోజుల లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు గోపాలమిత్ర ల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.

త్వరలో గోపాలమిత్రాలు, ఆయా అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 2014 నాటికి విజయ డెయిరీ  పాల సేకరణ 1.27 లక్షల లీటర్లు ఉండగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రత్యేక చొరవతో  31.10.2015 నాడు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించిన తర్వాత ప్రతి రోజు 4.7 లక్షల లీటర్లకు ప్రతిరోజు కు పాల సేకరణ పెరిగిందని వివరించారు. ఇప్పటి వరకు 352 కోట్ల రూపాయల ప్రోత్సాహకం అందించినట్లు చెప్పారు. పాడి గేదెల పంపిణీ కి ముందు జూలై 2018 లో 3.6 లక్షల లీటర్ల పాల సేకరణ ఉండగా,  65 వేల పాడి గేదెలను సబ్సిడీ పై పంపిణీ చేసిన తర్వాత పాల సేకరణ 2 లక్షల లీటర్లకు పడిపోవడం బాధాకరం అన్నారు.

పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బంది ఉన్నా, జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు, మందులు పంపిణీ చేయడం ప్రభుత్వం ఇన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉన్నప్పటికీ పాలసేకరణ పెరగకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో నిబద్దతతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించ వచ్చని చెప్పారు. రైతులకోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్న విషయాన్ని వివరించి విజయ డెయిరీకి పాలు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాల చర్యలను తీసుకుంటుందని అన్నారు. గోపాలమిత్రల ద్వారా పశువులకు గ్రామాలలో కృత్రిమ గర్భధారణ నిర్వహించడం, ప్రత్యేక శిభిరాలను ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నాణ్యమైన పాడి గేదెల ఉత్పత్తి కోసం సుమారు 8 లక్షల డోసుల వీర్యం కరీంనగర్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏ ఏ సమయాలలో టీకాలు వేయాలి, ఆరోగ్య పరిస్థితిని తెలిపేలా 37 లక్షలకు 16 లక్షల హెల్త్ కార్డ్ లను పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. మిగిలిన21 లక్షల కార్డ్ లను కూడా వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22 లక్షల గేదెలకు జియో ట్యాగ్ చేసినట్లు తెలిపారు. విజయ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. మేడారం జాతర లో, నుమాయిష్ ఎగ్జిబిషన్ లో విజయ ఔట్ లెట్ లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విక్రయాలు జరిగేలా కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు.


More Press News