హస్త కళాకారుల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు: ఏపీ చేనేత, జౌళిశాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా
- ఆంధ్రప్రదేశ్ కళారూపాలు ఇతర రాష్ట్రాలలో విక్రయానికి ప్రణాళిక
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పివిపి మాల్ లో ఈశాన్య రాష్ట్రాల చేతి వృత్తి నిపుణుల ఉత్పత్తుల సంగమంగా ఏర్పాటు చేసిన “ఇతివృత్త ప్రదర్శన, అమ్మకం – 2020” ను శుక్లా శుక్రవారం ప్రారంభించారు. మార్చి 15 వరకు పది రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుండగా, 8 రాష్ట్రాల నుండి నైపుణ్యం కలిగిన కళాకారులు తమ హస్తకళలను విక్రయించేందుకు తరలి వచ్చారు. హస్త కళల ఎగుమతి ప్రోత్సాహక మండలి, కేంద్ర హస్త కళల అభివృద్ధి కమీషనర్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది సంస్ధ ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తుండగా విభిన్న కళాకృతుల ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హిమాన్హు శుక్లా మాట్లాడుతూ హస్తకళలను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించ వలసిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఒక లాభాపేక్ష రహిత సంస్ధగా పనిచేస్తుందని, సుమారు 11000 మంది సభ్యులు దీనిలో ఉన్నారని వివరించారు. హస్తకళల ఎగుమతిని ప్రోత్సహిస్తూ తగిన మద్దతుతో సాంప్రదాయతలను సంరక్షిస్తూ భారతదేశం యొక్క ఇమేజ్‌ను పెంపొందించే క్రమంలో ఈ సంస్ధ వేగంగా ముందడుగు వేస్తుందని హిమాన్హు శుక్లా అన్నారు.
డెవలప్‌మెంట్ కమిషనర్ హస్తకళలతో సమన్వయంతో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ హస్తకళలను ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారని వారికి దేశీయ ఉత్పత్తులను అందించటం ద్వారా పరోక్షంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం అర్జించటం జరుగుతుందని వివరించారు. విజయవాడ నగర వాసులు సౌకర్యార్ధం ఉత్పత్తి దారులు తగిన రాయితీలను కూడా అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులతో రానున్న రోజులలో డిల్లీ, ముంబాయి తదితర ప్రాంతాలలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామన్నారు. చేతి వృత్తులకు దేశీయంగానే బలమైన మార్కెట్ ఉందని దానిని సద్వినియోగం చేసుకోగలిగితే మంచి ఫలితాలను ఆశించవవచ్చని శుక్లా పేర్కొన్నారు.
కార్యక్రమంలో హస్త కళల ఎగుమతుల ప్రోత్సాహక మండలి దక్షిణాది ప్రాంతాల సమన్వయ కర్త కె ఎన్ తులసీ రావు, కేంద్ర జౌళి శాఖ హస్తకళల విభాగపు సహాయ సంచాలకులు డాక్టర్ లంకా మనోజ్, హస్త కళల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సహాయ సంచాలకులు రాజేష్ సింగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదర్శనలో ఫ్యాషన్ ఉపకరణాలు, చెరకు, వెదురు చేతిపనులు, సహజ ఫైబర్ హస్తకళలు, అస్సాం నుండి టెర్రకోట చేతిపనులు, వంట సామాను, గృహోపకరణాలు, అలంకరణలు, నాగాలాండ్ నుండి వస్త్ర ఉత్పత్తులు, నల్ల కుండలు, సంచులు, బుట్టలు వంటివి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మణిపూర్ నుండి కళాత్మక వస్త్రాలు, చెరకు, వెదురు బుట్టలు, మేఘాలయ, త్రిపుర నేత, సిక్కిం ఆర్టిస్టిక్ జౌళి ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. చేతివృత్తుల తయారీ దార్లే నేరుగా విక్రయాలు చేస్తున్న నేపధ్యంలో సరసమైన ధరలకు ఉత్పత్తులు లభిస్తున్నాయి.