హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతృప్తినిచ్చింది: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ముఖ్యమంత్రి మానస పుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం రూపకల్పనలో తాను భాగస్వామ్యం కావటంతో తన సర్వీసులో అత్యంత సంతృప్తిని ఇచ్చిన విషయం అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి. సీనియర్ ఐ.ఏ.ఎస్ గా ముఫ్పై ఆరేళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన తివారి ఇవాళ పదవీ విరమణ చేశారు.
అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ పొందిన తివారిని అరణ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఆయనతో పనిచేసిన పలువురు ఐ.ఏ.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా కర్నూలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన తివారి, ప్రభుత్వంలో అత్యంత ప్రధానమైన రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటి పారుదల, విద్యుత్ శాఖల్లో కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్, అనేక సార్లు తెలంగాణకు హరితహారంపై సమీక్షలు నిర్వహించారని, ఆ కార్యక్రమం రూపకల్పనలో భాగస్వామ్యమై, ఐదేళ్లుగా విజయవంతంగా అమలు కావటం తనకు సర్వీస్ మొత్తంలో సంతోషాన్ని ఇచ్చిన విషయం అని సన్మాన కార్యక్రమం సందర్భంగా తివారి అన్నారు.
కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఎఫ్.డీ.సీ ఎం.డి రఘవీర్, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఐ.ఎఫ్.ఎస్ అధికారులు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, సువర్ణ, అటవీ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.