హైదరాబాద్ ను బెగ్గింగ్ రహిత సిటీగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం!
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక
బెగ్గర్స్ సమగ్ర పునరావాసంకై టూరిజం ప్లాజాలో ఎన్.జి.వోలు, జిహెచ్ఎంసి అధికారులతో జరిగిన సదస్సు
సదస్సులో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, రాష్ట్ర పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, కేంద్ర సంయుక్త కార్యదర్శి రాధికాచక్రవర్తి
బెగ్గర్స్ కు పూర్తి స్థాయిలో పునరావాసం, ఆర్థిక స్వావలంబనకు మార్కెటింగ్ టై-అప్ తో అనువైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, నగరాన్ని బెగ్గింగ్ రహితంగా చేసేందుకు పైలట్ ప్రాజెక్టు క్రింద జిహెచ్ఎంసిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశవ్యాప్తంగా పది నగరాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నట్లు తెలిపారు. 2020 ఏప్రిల్ నుండి పైలెట్ ప్రాజెక్ట్‌ను అమలు చేసేందుకు సమగ్ర కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. టూరిజం ప్లాజాలో శనివారం జిహెచ్ఎంసి, పోలీసు అధికారులు, ఎన్.జి.వోలతో నిర్వహించిన సదస్సులో బెగ్గింగ్ లో వున్న వ్యక్తులకు గౌరవ ప్రదమైన పునరావాసం కల్పించే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు.
ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బెగ్గర్స్ పునరావాసానికి రూ. 10కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పుడు మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉండేదని, నేడు దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఉత్తమ సిటీగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. దానికి ఇక్కడ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు, బహుళ సంస్కృతిక, సామరస్య జీవన విధానం మూల కారణమని తెలిపారు. నిరుపేదల సంక్షేమం పైనే నగర ఔన్నత్యం కనబడుతుందని తెలిపారు. పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
గౌరవంగా ఉండేందుకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నదని, పేదలకు అన్నపూర్ణ భోజన పథకాన్ని అమలు చేస్తున్నదని అభినందించారు. ప్రతి వ్యక్తి గౌరవంగా బ్రతికేందుకు అవకాశం కల్పించుటలో భాగంగా బెగ్గర్స్ సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులను గుర్తించాలని తెలిపారు. ఈ అంశంలో ఎన్.జి.వోలతో పాటు కమ్యునిటి పాత్ర కీలకమైనదని తెలిపారు. బెగ్గర్స్‌కు పునరావాసం కల్పించడంతో పాటు, వారి మానసిక, శారీరక రుగ్మతులకు వైద్య సేవలను అందించాలని తెలిపారు. స్వతంత్రంగా బ్రతికేందుకు జీవనోపాధిని కల్పించే రంగంలో నైపుణ్య శిక్షణతో పాటు మార్కెటింగ్‌ను అనుసంధానం చేయాలని సూచించారు. సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరంలో బెగ్గర్స్‌కు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించుటకు కార్యాచరణ ప్రణాళిక ఉండాలని తెలిపారు. బెగ్గింగ్‌లో ఉన్న కుటుంబాల పిల్లలకు విద్యా సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. విద్య వలన ఆయా కుటుంబాల వ్యవహార శైలీలో మార్పు వస్తుందని అభిప్రాయపడినారు.
జిహెచ్ఎంసి డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ నగరంలోని పేదలు, బెగ్గర్స్ సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. 150 వార్డులలో అన్నపూర్ణ పథకం కింద రూ.5/- కే భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. బెగ్గర్స్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చుటలో సహకరించాలని ఎన్.జి.వోలకు విజ్ఞఫ్తి చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్ పోటీ పడుతున్నదని, పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ ఆశయాల మేరకు సమన్వయంతో పైలెట్ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. బిక్షం వేయుట మన దేశంలో ఆచారం, సంప్రదాయంగా ఉన్నదని, అయితే నిరుపేదలు, అనాథల సంక్షేమానికి కృషి చేస్తున్న సంస్థలకు విరాళాలుగా ఇవ్వాలని సూచించారు. బెగ్గర్స్ సమగ్ర పునరావాసానికి చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి రాధికచక్రవర్తి మాట్లాడుతూ బెగ్గర్స్ సమగ్ర పునరావాస కార్యక్రమం పై విధివిధానాలను రూపొందించుటకు దేశ వ్యాప్తంగా సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. బెగ్గింగ్‌లో ఉన్న దివ్యాంగులు, సీనియర్ సిటీజన్లు, మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తదనుగుణంగా బెగ్గర్స్‌ను గుర్తించుటకు పూర్తి వివరాలతో సర్వే చేయాలని స్పష్టం చేశారు. బెగ్గర్స్, గుర్తింపు, మొబలైజేషన్, షెల్టర్ హోం ఏర్పాటు, పునరావాసం, హెల్త్ కేర్, పిల్లల విద్య, నైపుణ్య శిక్షణ, తదితర అంశాలను కార్యచరణ ప్రణాళికలు పొందుపర్చాలని సూచించారు.
రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ బెగ్గర్స్ పునరావాస కార్యక్రమం అమలులో కేంద్ర ప్రభుత్వానికి జిహెచ్ఎంసి పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. బెగ్గింగ్ చాలా తీవ్రమైన సమస్యగా ఉన్నప్పటికీ సహజంగా పట్టించుకోమని తెలిపారు. పూర్తిస్థాయిలో ఈ సమస్యను పరిష్కరించేందుకు సామాజిక, ఆర్థిక దృక్కోణంలో చూడాలని తెలిపారు. 2005-06లో హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో బెగ్గర్స్ పరిస్థితిపై నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే గురించి వివరించారు. బెగ్గింగ్ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసి కృషి చేస్తున్నదని తెలిపారు. రూ. 5/- లకే అన్న పూర్ణ భోజనం, నైట్ షెల్టర్స్ ఏర్పాటు, నైట్ షెల్టర్స్‌లో నైపుణ్య శిక్షణ వసతులు, సామాజిక బాధ్యత పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు. బెగ్గింగ్‌లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ హరీష్, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు వి.సంతోష్, రాహుల్ రాజ్, జె.శంకరయ్య, యు.సి.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.సౌజన్య, ట్రాఫిక్ డిసిపి చౌహాన్, పోలీసు అధికారులు, ఎన్.జి.వోలు, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.