వ‌చ్చే వేస‌వికి తెలంగాణ‌లోని ఏ ఒక్క ఆవాసంలోనూ తాగునీటి స‌మ‌స్య రావొద్దు: మిష‌న్ భ‌గీర‌థ ఈ.ఎన్.సి కృపాక‌ర్ రెడ్డి

  • మార్చి చివ‌రి నాటికి మిష‌న్ భ‌గీర‌థ స్థిరీక‌ర‌ణ (స్టెబిలైజేష‌న్) ప‌నులు పూర్తి కావాలి

  • విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించే అధికారుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు

  • మిష‌న్ భ‌గీర‌థ నీటి వినియోగం-సంర‌క్ష‌ణ పై మ‌రిన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించండి 

  • భ‌గీర‌థ రాష్ట్ర స్థాయి స‌మీక్షా స‌మావేశంలో ఈ.ఎన్.సి కృపాక‌ర్ రెడ్డి

వ‌చ్చే వేస‌విలో తెలంగాణ‌లోని ఏ ఒక్క ఆవాసంలోనూ తాగునీటి స‌మ‌స్య రావొద్ద‌న్నారు ఈ.ఎన్.సి కృపాక‌ర్ రెడ్డి. మార్చ్ చివ‌రి నాటికి మిష‌న్ భ‌గీర‌థ తాగునీటి స‌రాఫ‌రా వ్య‌వ‌స్థ స్టెబిలైజేష‌న్ ప‌నులు పూర్తి కావాల‌న్నారు. తొలిసారిగా హైద‌రాబాద్ వెలుపల గ‌జ్వేల్ -కోమ‌టిబండ మిష‌న్ భ‌గీర‌థ నాలెడ్జ్ సెంట‌ర్ లో రాష్ట్ర స్థాయి స‌మావేశం నిర్వ‌హించిన ఈ.ఎన్.సి కృపాక‌ర్ రెడ్డి, విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించే అధికారుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని మెజార్టీ గ్రామీణ ఆవాసాల్లో భ‌గీర‌థ నీళ్లు ఇంటింటికి న‌ల్లాతో  స‌రాఫ‌రా అవుతున్నాయ‌న్నారు. కొన్ని ఆవాసాల్లో మాత్ర‌మే ఇంకా ఇంట్రా విలేజ్ తో నీటి స‌రాఫ‌రా అవ‌డం లేద‌న్నారు.

మార్చి నాటికి మిగిలిన ఓహెచ్ఆర్ఎస్ నిర్మాణాల‌ను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటి స‌రాఫ‌రాను ప్రారంభించాల‌న్నారు. అందుకు త‌గిన విధంగా యాక్ష‌న్ ప్లాన్ ను రూపొందించుకుని ప‌నిచేయాల‌న్నారు. ఇంట్రా విలేజ్ ప‌నుల్లో ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాలు వెనుక‌బ‌డ్డాయ‌ని, అక్క‌డి అధికారులు తీరు మార్చుకోకుంటే శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఎక్క‌డైతే ప‌నులు పూర్తై, పూర్తి స్థాయిలో భ‌గీర‌థ నీళ్లు ఇంటింటికి న‌ల్లాతో స‌రాఫ‌రా అవుత‌న్నాయో, అక్క‌డ మ‌రిన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. భ‌గీర‌థ నీటిని మాత్ర‌మే తాగేలా గ్రామ‌స్థుల‌ను చైత‌న్య‌ ప‌ర‌చాల‌న్నారు. ఆర్వో నీటిని తాగ‌డంతో క‌లిగే అన‌ర్థాల‌ను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌న్నారు.

మిష‌న్ భ‌గీర‌థతో ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన నీటిని స‌రాఫ‌రా చేయ‌డానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఈ.ఎన్.సి కోరారు. వేస‌వి కాలం పూర్తి అయ్యే వ‌ర‌కు సెల‌వు దినాల్లో కూడా స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ మీటింగ్ లో ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు జ్ఞానేశ్వ‌ర్, చీఫ్ ఇంజ‌నీర్లు విజ‌య్ ప్ర‌కాశ్, చ‌క్ర‌వ‌ర్తి, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ రెడ్డి,క‌న్స‌ల్టెంట్లు న‌ర్సింగ‌రావు, జ‌గ‌న్, మ‌నోహ‌ర్ బాబు, సురేష్ కుమార్, నందారావు, కృష్ణమూర్తితో పాటు అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈ.ఈ లు పాల్గొన్నారు.


More Press News