మ్యాడ్'సీక్వెల్‌ 'మ్యాడ్ స్క్వేర్' నుంచి ఫస్ట్ లుక్ విడుదల

గతేడాది విడుదలై విజయాన్ని సాధించిన వినోదాత్మక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌' చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం మ్యాడ్‌ స్క్వేర్‌.  నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం నుంచి మొదటి గీతాన్ని సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.  

సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో  కనిపిస్తున్నారు. . ఈ పోస్టర్ లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది.మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు అంటున్నారు. అందరూ మెచ్చుకునేలా 'మ్యాడ్' చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.


శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.మ్యాడ్' కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

More Press News