టీఎస్‌-బీపాస్ అమ‌లుకై స‌మాయ‌త్తంకండి: టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు మంత్రి కేటీఆర్ పిలుపు

టీఎస్‌ఐపాస్ వ‌లే అనుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేసి నిర్ణీత కాలంలో జారీచేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న టీఎస్‌-బీపాస్ అమ‌లుకు స‌మాయ‌త్తం కావాల‌ని టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్‌, ఐటి శాఖ మంత్రి కే.టీ రామారావు పిలుపునిచ్చారు. టీఎస్‌-బీపాస్ పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని ఆదేశించారు. అంద‌రం పౌరులుగా ఆలోచిద్దామ‌ని చెప్పారు. గురువారం ఎం.సి.హెచ్‌.ఆర్‌.డిలో హెచ్‌.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి, డి.టి.సి.పి టౌన్‌ప్లానింగ్ అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడుతూ మార్చిలో ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టి, ఏప్రిల్ 2వ తేదీ నుండి పూర్తిస్థాయిలో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లతో పాటు ఆరు ప‌ట్ట‌ణాభివృద్ది సంస్థ‌ల‌లో టీఎస్‌-బీపాస్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న‌ద‌ని, ఆటుపోట్ల‌ను అదిగ‌మించి అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం మ‌న రాష్ట్రంలో 43శాతం ఉన్న ప‌ట్ట‌ణ జ‌నాభా రాబోయే ఆరేళ్ల‌లో 50శాతానికి పైగా చేరుకుంటుంద‌ని తెలిపారు. అలాగే వాహ‌నాల సంఖ్య ప్ర‌స్తుతం ఒక కోటి 30ల‌క్ష‌ల‌కు పెరిగిన‌ట్లు తెలిపారు. రాష్ట్రం నుండి వ‌చ్చే ఆదాయంలో 55శాతం వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోనే వ‌స్తున్న‌ట్లు తెలిపారు. ఉత్త‌మ ప్రామాణిక జీవ‌న ప్ర‌మాణాలు ఉన్న న‌గ‌రంగా ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లు హైద‌రాబాద్‌ను అనేక సార్లు గుర్తించిన‌ట్లు వివ‌రించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు క్వాలిటీ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్ పెరిగింద‌ని తెలిపారు. దీనంత‌టికీ కార‌ణం హెచ్‌.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు చేస్తున్న కృషియే కార‌ణ‌మ‌ని అభినందించారు. దేశంలోని ఇత‌ర మెట్రో న‌గ‌రాల‌తో పోల్చుకుంటే హైద‌రాబాద్‌లో ఉన్న మౌలిక వ‌స‌తులు మెరుగుగా ఉన్నాయ‌ని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక‌వేత్త‌లు, వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు మొద‌టి ప్రాధాన్య‌త‌గా హైద‌రాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం అభివృద్ది కూడా ప్ర‌భుత్వ ప‌నితీరుకు నిద‌ర్శ‌నంగా ఉన్న‌ట్లు తెలిపారు. అయితే వ్య‌క్తుల‌పై వ్య‌వ‌స్థ ఆదార‌ప‌డ‌రాద‌ని, అభివృద్దిని వ్య‌వ‌స్థీకృతం చేసేందుకు సుల‌భ‌త‌రంగా అనుమతులు జారీచేసే ప్ర‌క్రియ‌లో సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగాన్ని పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. పౌరుల దృష్టిలో ఆలోచించి మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు.

టీఎస్‌-ఐపాస్ ద్వారా  35ర‌కాల పారిశ్రామిక‌ అనుమ‌తుల‌ను వేగంగా జారీచేస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా ఫైర్ స‌ర్వీసెస్‌, విద్యుత్‌, ట్రాఫిక్‌, ప్లానింగ్ విభాగాల నుండి భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను స‌త్వ‌రంగా జారీచేసేందుకు టీఎస్‌-బీపాస్ ను రూపొందించిన‌ట్లు తెలిపారు. టీఎస్‌-బీపాస్ పై ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, నిర్మాణ సంస్థ‌ల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిపారు. టీఎస్‌-బీపాస్ ద్వారా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులకు అనుమ‌తులు జారీలో జాప్యంచేసే అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌నున్న‌ట్లు తెలిపారు. జాప్యానికి జ‌రిమానా విధించే యోచ‌న చేస్తున్న‌ట్లు తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొర‌త‌ను అదిగ‌మించుట‌కై ఔట్‌సోర్సింగ్ ద్వారా తాత్కాలికంగా నియామ‌కాలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. టీఎస్‌పిఎస్‌సి ద్వారా రెగ్యుల‌ర్ నియ‌మాకాలు జ‌రిగేంత‌వ‌ర‌కు ఈ వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక‌ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్, సిసిపి దేవేంద‌ర్‌రెడ్డి, హెచ్‌.ఎం.డి.ఏ ప్లానింగ్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.


More Press News