ఫ్యాక్షన్ పోకడలతో ప్రజలే నష్టపోతున్నారు... నాయకులు బాగానే ఉన్నారు: పవన్ కల్యాణ్

  • భయపెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి..?

  • కియా కార్ల కంపెనీ తరలిపోయే పరిస్థితి తీసుకువచ్చారు

  • పథకాల పేరుతో ఒక చేత్తో డబ్బులిచ్చి... నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మరో చేత్తో లాగేసుకొంటున్నారు

  • జగన్ రెడ్డి గారు ఆ రోజు రాజధానికి అమరావతిలో 30 వేల ఎకరాలు కావాలి అన్నారు... ఇప్పుడెందుకు మాట మార్చారు?

  • ఇస్లాం మతం అనుసరించే ముస్లింలకు సి.ఏ.ఏ., ఎన్.ఆర్.సి.ల వల్ల ఇబ్బందులు ఎదురుకావు

  • పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్

నాయకుల ఫ్యాక్షన్ పోకడల మూలంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వచ్చిన కియా కార్ల కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితి దాపురించిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. పెట్టుబడి దారులను భయపెడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి ఫ్యాక్షన్ విధానాల వల్ల నష్టపోయేది ప్రజలే కానీ... నాయకులు కాదన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ నేల కాదు... చదువుల నేల... సరస్వతి ఉన్న నేల, పూర్వం ఈ ప్రాంతంలో ఏ విలువలైతే రాజ్యమేలాయో... ఆ విలువలను తీసుకురావడానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. గురువారం సాయంత్రం శంషాబాద్ లో  కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను, పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగిస్తున్న తీరునీ, ఇసుక బ్లాక్ మార్కెట్ గురించీ కార్యకర్తలు పవన్ కల్యాణ్ కి తెలియచేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "రాయలసీమ ప్రాంతం భయం గుప్పెట్లో బిగుసుకుపోయింది. ఈ ప్రాంతంలో నీరు పల్లం వైపు వెళ్లదు... ఎవరు బలవంతులో వారి పొలాల్లోకి పారుతుంది. రాయలసీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి జరగలేదో యువత ఆలోచించాలి. సీమలో కవాతు చేసినా, ఆలూరు దగ్గర హత్తిబెళెగళ్ దగ్గర పేలుళ్ల బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు లక్షలాది మంది తరలివచ్చారు. ఎలక్షన్ సమయంలో మాత్రం స్థానిక నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని ముందే ఊహించే 25 ఏళ్ల ప్రయాణం అని చెప్పాను. మన దగ్గర ఇప్పుడున్న యువత 10 ఏళ్ల తర్వాత మరింత బలమైన వ్యక్తులుగా మారుతారు. 

* ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్రానికి నష్టం 

13 జిల్లాలే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు వస్తే అందరం నష్టపోతాం. అందుకే మూడు రాజధానుల అంశంపై స్పష్టమైన వైఖరి తెలియజేశాం. 2014లో కర్నూలు ప్రాంతంలో రాజధాని పెడతామని అప్పటి తెలుగుదేశం ప్రకటిస్తే కచ్చితంగా మద్దతు ఇచ్చేవాళ్లం. విభిన్న భాషలు, సంస్కృతులు కలిగిన కర్ణాటక రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకుండా పాలన కొనసాగుతుంటే... కేవలం తెలుగు మాట్లాడే మన మధ్య ప్రాంతీయ విభేదాలతో సమస్యలు తెస్తున్నారు. అమరావతిలో రాజధాని పెట్టడం ఇష్టంలేకపోతే జగన్ రెడ్డి గారు ఆనాడే వ్యతిరేకించాల్సింది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపి...30 వేల ఎకరాలు కావాలి అన్నారు. ఆనాడు అంత భారీగా ఒకేసారి ఎందుకు అని నేను అన్నాను. జగన్ రెడ్డి గారికి ఈ రోజే జ్ఞానోదయం అయినట్లు  భావితరాల భవిష్యత్తు కోసం మూడు రాజధానులు అంటున్నారు. ప్రతీకార రాజకీయాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు చేయడానికి మీ పర్మిషన్ తీసుకున్నామని వైసీపీ నాయకులు చెబుతున్నారు నిజమేనా అని కేంద్ర పెద్దలను అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య విధాన నిర్ణయాలు అనేవి ఉత్తర, ప్రత్యుత్తరాల్లో ఉంటాయి. అలాంటివి ఉంటే వైసీపీ నాయకులను చూపించమని చెప్పండి అని అన్నారు. దీన్నిబట్టి మూడు రాజధానులపై కేంద్రం పర్మిషన్ తీసుకున్నామని వైసీపీ చెబుతున్న మాట అబద్ధం అని తేలిపోయింది. నిజంగా ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరిగిపోతుందా..? కర్నూలు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే నీటి సమస్య తీరుతుందా..?. వలసలు తగ్గిపోతాయా..?. రాజధాని వస్తే అద్భుతాలు జరుగుతాయన్న భ్రమలను నాయకులు సృష్టిస్తున్నారు. 

* భారతదేశం ఎంతో సహనం ఉన్న నేల 

సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల వల్ల ఇస్లాం మతం పాటించే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  భయపడాల్సిన అవసరం లేదు.  సెక్యులరిజం భారత జీవనాడి. సీఏఏ చట్టం ద్వారా భారతీయ ముస్లిం లను  దేశం బయటకు పంపిస్తారనేది అవాస్తవం. ప్రతిపక్షాలు ప్రజల్లో అలాంటి భయాందోళనలను క్రియేట్ చేశాయి. భారతదేశం ఎంతో సహనం ఉన్న నేల. అలాంటి నేల ముస్లింలకు ఎందుకు అన్యాయం చేస్తుంది. ఈ దేశంలో పుట్టిన అందరికి సమాన హక్కులు ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు సవ్యంగా అందాలనే జనసేన పార్టీ పెట్టాను. అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే వ్యక్తిని నేను. మతం మార్చుకొని కూడా కులం పేరు పెట్టుకొని తిరిగే వ్యక్తిని మాత్రం కాదు.

* బీజేపీతో పొత్తు ఎందుకంటే..? 

భారతదేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ఈ దేశంలో ఎవరు ఏ పార్టీ పెట్టినా అందులో ఎక్కువగా హిందువులే ఉంటారు. జగన్ రెడ్డి పార్టీ పెట్టినా, కాంగ్రెస్ పార్టీ అయినా అందులో మెజార్టీ హిందువులే ఉంటారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే హిందువుల పార్టీ కాదు. అన్ని పార్టీల్లో కూడా హిందువులే ఎక్కువ ఉంటారు. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను. బీజేపీతో ఇవాళ పొత్తు పెట్టుకోలేదు. 2014లోనే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించాం.  2019 సార్వత్రిక ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్లను తక్కువగా అంచనా వేయకండి. ఒకరు ఓడిపోవడానికి, ఇంకొకరు ప్రభుత్వంలోకి రావడానికి మన ఓటు బ్యాంకు ఉపయోగపడుతుంది. మన ఓటు బ్యాంకు మనకు సహయపడేలా నిలకడగా, నిబద్ధతతో ముందుకు వెళ్దాం. 

* ఒక చేత్తో ఇవ్వడం.. ఇంకో చేత్తో లాక్కోవడం 

సంక్షేమ పథకాల పేర్లు చెప్పి గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం... నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఈ మూడు నెలల్లోనే పాల ధరలు మూడు సార్లు పెరిగాయి. పెట్రోల్ ధర పెంచింది. ఒకవైపు సంక్షేమ పథకాల పేరు చెప్పి పేదలకు డబ్బులు ఇవ్వడం... ఇంకోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి లాక్కోవడం. ఈ విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా జనసేన కార్యకర్తలు కార్యచరణ రూపొందించాలి. ఇప్పటికైనా రాయలసీమ యువత మేల్కోవాలి. ప్రశ్నించకుండా భయపడుతూ ఉంటే ఎప్పటికీ భయపెట్టే నాయకుల చెప్పుచేతల్లో ఉండిపోతారు. దమ్మున్న యువకులు రాజకీయాల్లోకి రాకపోతే రాయలసీమ సమస్యలు తీరవు. మార్పు ఒక్క రోజులో రాదు. భయం వదిలి ధైర్యంగా మాట్లాడండి. మీకు అండగా ఉంటా. రాయలసీమ మార్పుకు జనసేన పార్టీ తరపు నుంచి యువకులకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తాం. రాయలసీమ అభివృద్ధి కోసం యువత బలమైన సైన్యంలా తయారవ్వాల"ని ఆకాంక్షించారు.  ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్  చింతా సురేష్ బాబు  పాల్గొన్నారు.


More Press News