హైద‌రాబాద్‌లో తొలిసారిగా ఇండో-ఉజ్బెక్ ఫార్మా బిజినెస్ ఫోరం

** వాణిజ్యం, పెట్టుబ‌డుల‌కు స‌రికొత్త దారులు*

** ప‌లు ఎంఓయూల‌పై సంత‌కాలు*

 హైద‌రాబాద్‌, జూన్ 25, 2024: భారత్, ఉజ్బెకిస్థాన్ దేశాల మధ్య ఫార్మా రంగంలో వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను మ‌రింత పెంచేందుకు ఇండో-ఉజ్బెకిస్థాన్ ఫార్మా బిజినెస్ ఫోరం హైదరాబాద్ లో విజయవంతంగా జరిగింది. న్యూఢిల్లీలోని ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయం, ఉజ్బెకిస్థాన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ, నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనికి రెండు దేశాల నుంచి ఉన్న‌త స్థాయి అధికారుల‌తో పాటు ప‌రిశ్ర‌మ దిగ్గ‌జాలు కూడా హాజ‌ర‌య్యారు.

 ఈ ఫోరమ్ లో భారతదేశంలోని ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ రాయబారి సర్డోర్ ఎం. రుస్తంబ‌యెవ్‌తో సహా విశిష్ట భాగస్వాములు పాల్గొన్నారు; నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దివ్య రాజ్, ఉజ్బెకిస్థాన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ అబ్దుల్లా అజిజోవ్, ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన నిపుణులు, దౌత్యవేత్తలు, హెటిరో ల్యాబ్స్, భారత్ బయోటెక్ వంటి భారత ఫార్మా కంపెనీలతో పాటు ఇతర ప్రఖ్యాత సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

 ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా కీలక అడుగుగా పలు ఎంఓయూల‌పై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలు భారత్‌, ఉజ్బెక్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే జాయింట్ వెంచర్లు, పరిశోధన సహకారాలు, సాంకేతికత‌ బదిలీలకు మార్గం సుగమం చేస్తాయి. దాంతోపాటు.. పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు కూడా జ‌రిగాయి. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, పరస్పర వృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన నిబద్ధతకు ఇది నిద‌ర్శ‌నం.

 భారత్‌, ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం సుమారు 800 మిలియన్ డాలర్లు. భారత్‌ నుంచి ప్రధానంగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఉజ్బెకిస్థాన్ వైపు భారతీయ ఫార్మసీ, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫోరం నొక్కిచెప్పింది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కోణాలతో కూడిన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కీలక రంగాలుగా వైద్య‌పరిశ్రమ, వైద్య విద్యను హైలైట్ చేశారు.

భారతదేశంతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలతో మధ్య ఆసియాలో ప్రధాన కేంద్రంగా ఉన్న ఉజ్బెకిస్థాన్ సిల్క్ రోడ్డు ద్వారా చారిత్రక సంబంధాలను పంచుకుంటుంది. ఈ రెండు దేశాల మ‌ధ్య 2వేల సంవ‌త్స‌రాల‌కు పైగా ద్వైపాక్షిక సంబంధాలు బ‌లంగా ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ఎప్ప‌టినుంచో భారతీయ ఫార్మా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులను స్వాగతించింది. ఈ పరిణామం టూరిజం, మెడికల్ టూరిజం, మెడికల్ ఎడ్యుకేషన్ వంటి రంగాలకు ఊతమిచ్చింది. ఇండిగో, ఉజ్బెక్ ఎయిర్‌వేస్ ద్వారా భారతదేశం, ఉజ్బెకిస్థాన్ మధ్య రోజువారీ విమానాలు ఈ సంబంధాలను సులభతరం చేస్తున్నాయి.

 రెండు దేశాల్లో ఉన్న నియంత్ర‌ణ‌లు, మార్కెట్ అందుబాటు, నాణ్యాతా ప్ర‌మాణాల్లాంటి కీల‌క అంశాల ఆధారంగానే వాణిజ్యం, పెట్టుబ‌డులు సాకారం అవుతాయి. ఈ అంశాల‌పై లోతైన చర్చలకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికను అందించింది. మందుల అభివృద్ధి, తయారీలో సహకారాన్ని మ‌రిం త పెంచుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఇందులో పాల్గొన్న ప్ర‌ముఖులు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. దీనివ‌ల్ల రెండు దేశాల్లో మ‌రింత భ‌రించ‌గ‌ల‌, అందుబాటులో ఉండే వైద్య స‌దుపాయాలు రెండు దేశాల‌కు అందుబాటులోకి వ‌స్తాయి.

 ఫార్మాస్యూటికల్ రంగంలో సహకారం, ఆవిష్కరణలను పెంపొందించడంలో ఫోరం ప్రాముఖ్యతను డాక్టర్ దివ్య రాజ్ నొక్కి చెప్పారు. సర్డోర్ ఎం. రుస్తంబ‌యెవ్, అబ్దుల్లా అజిజోవ్ ఇండో-ఉజ్బెక్ ఫార్మాస్యూటికల్ సహకారం భవిష్యత్తు గురించి ఆశాభావం వ్యక్తం చేస్తూ, పాల్గొన్న‌ వారందరి కృషిని, సహకారాన్ని ప్రశంసించారు.

ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించాల‌న్న‌ నిబద్ధతతో ఈ సదస్సు ముగిసింది. ఈ కార్యక్రమం సానుకూల ఫలితాలు భారతదేశం, ఉజ్బెకిస్థాన్ రెండింటి పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయని, వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని, సంపన్న భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు.

 ఈ కార్య‌క్రంలో ఇంకా ఉజ్బెకిస్థాన్ ఎంబ‌సీ నుంచి రాయ‌బారులు ఎస్‌.సుయ‌రొవ్, కె.స‌మియెవ్‌, ఉజ్బెకిస్థాన్ ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్ట‌ర్ అబ్దుల్లా అజిజొవ్, ఇంకా ఎస్. ఒబ్లొయొరొవ్, ఎస్.ఇషంఖ‌నొవ్‌, నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ దివ్యారాజ్, బీవీకే రాజ్, వెలుగుబంట్ల శ్రీ‌రోహిత్‌, బుఖారా ప్రాంతీయ ప్ర‌భుత్వాధినేత ముహ‌మ్మ‌ద్జ‌న్ రేఖొనొవ్‌, జె. యుల్డొషెవ్‌, భార‌తీయ ఫార్మా కంపెనీలైన హెటెరో ల్యాబ్స్, భార‌త్ బ‌యోటెక్, ఇత‌ర ప్ర‌ధాన సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

     

More Press News