అమరావతి రైతుల పరిస్థితి ఉత్తరాంధ్ర రైతులకి రాకుండా చూడాలి: పవన్ కల్యాణ్

•విశాఖ భూసమీకరణపై ఉత్తరాంధ్ర నాయకులకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

విశాఖపట్నం మహా నగరానికి చేరువలోని పది మండలాల్లో భూసమీకరణ ద్వారా అసైన్డ్ భూములను తిరిగి తీసుకొనేందుకు ప్రభుత్వం సిద్దమై పేద రైతులకు అన్యాయం చేస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రైతులు ఎక్కువగా నష్టపోతారన్నారు. ఇప్పటికే రాజధాని కోసం భూములు త్యాగం చేసిన అమరావతి రైతులను ప్రభుత్వం రోడ్డునపడేసిందనీ, అదే విధంగా తమనీ రోడ్డు మీదకు తీసుకువస్తుందనే భయం ఉత్తరాంధ్ర రైతుల్లో నెలకొందన్నారు. విశాఖ పరిసరాల్లో చేపట్టిన భూ సమీకరణపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం పవన్ కల్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఈ పరిణామంపై బుధవారం సాయంత్రం ఉత్తరాంధ్ర జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “అమరావతిలో ఇప్పటికే భూ సమీకరణ విధానంలో భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో కళ్లెదుట కనిపిస్తోంది. ఇప్పుడు విశాఖ నగరం చుట్టు పక్కల గ్రామాల్లోని భూములను సమీకరించేందుకు సిద్దమైంది.

6 వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర రైతుల్లో నెలకొన్న భయాందోళనలు గుర్తించి వారికి మన పార్టీ అండగా నిలవాలి. సమీకరణ కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్న తీరును మన నాయకులు, శ్రేణులు పరిశీలించాలి. పేద రైతులకు ప్రభుత్వ యంత్రాంగం ఇస్తున్న హామీలేమిటి? ఇలాంటి హామీలను అమరావతిలో ఎలా ఉల్లంఘించారో అధ్యయనం చేయండి. అధికారపక్షం నుంచి రైతులకు ఒత్తిళ్ళు  ఎదురవుతున్నాయని సమాచారం వస్తోంది. ఈ సమీకరణ ముసుగులో ఎలాంటి లావాదేవీలు సాగుతున్నాయో గుర్తించాలి. వీటిపై మీరంతా దృష్టి సారించి సమగ్రమైన నివేదిక సత్వరమే అందించాల”ని ఆదేశించారు.


More Press News