మేడారం జాతరకు వచ్చే భక్తులకు పూర్తి స్ధాయిలో సేవలు వినియోగంలో ఉండాలి: తెలంగాణ సీఎస్ ఆదేశం

ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. 

మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో టాయిలేట్ల వినియోగం, బస్సుల ఏర్పాటు, పారిశుధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ లాట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మేడారం జాతరకు వచ్చే భక్తుల మనస్సులో స్ధిర స్దాయిలో నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని అన్నారు.

వివిధ శాఖలకు సంబంధించి ఇంటర్ సెక్టోరల్ టీమ్స్ ప్రతి రోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఏవైనా అవాంతరాలు ఎదురైన పక్షంలో తక్షణం సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకొని వాటిని వెంటనే సరిదిద్దాలన్నారు. ప్రతిశాఖ ఆక్టివ్ గా పనిచేస్తూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టోల్ గేట్ల వద్ద నోడల్ అధికారులను నియమించి రద్ధీ ఏర్పడకుండా అదనపు ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారులపై మరమత్తుల కోసం కంటిన్ జెన్సి ప్రణాళిక రూపొందించుకొని, సిబ్భందిని ఎల్లప్పుడు అందుబాటులో ఉంచాలన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, రజత్ కుమార్, సునీల్ శర్మ, ఐజి నాగిరెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ కమీషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, కలెక్టర్ కన్నన్ వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.


More Press News