మండలి రద్దు సవ్యమైన చర్య కాదు: జనసేన

'రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పునరుద్ధరించిన శాసన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సవ్యమైన చర్య కాదని జనసేన భావిస్తోంది. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాలలో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఏదైనా ఒక బిల్లుపై శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మధనం చేసి అటువంటి బిల్లులను సరిదిద్దడానికి శాసన మండలిని రూపకల్పన చేశారు. ఇంతటి ఉన్నతాశయంతో ఏర్పాటైన మండలిని మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడం సబబు కాదని జనసేన భావిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. శాసన మండలి రద్దుకు ప్రజల ఆమోదం ఉందా..? లేదా అనే అంశాన్ని ఎక్కడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు.

అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసన మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో శాసనమండలి రద్దు చేయడం సహేతుకంగా అనిపించడం లేదు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లుగా జనసేన భావిస్తోంది.  శాసనమండలిని రద్దు చేసే ప్రత్యేక పరిస్థితులేవీ రాష్ట్రంలో నెలకొనలేదని జనసేన అభిప్రాయపడుతోంది'. అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.


More Press News