గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు

Related image

ముఖ్యమంత్రి కార్యాలయము తెలంగాణ ప్రభుత్వం

జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. 


ప్రస్తుత హైకోర్టు భవనం శిధిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటెజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Alok Aradhe
Revanth Reddy

More Press Releases