మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు

Related image

గిరిజన సంక్షేమ శాఖలో సమీక్షించిన మంత్రి సీతక్క

2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని గౌ|| మంత్రివర్యులు సీతక్క అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రివర్యులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగు ఆదేశాలిచ్చారు.

ఇంత క్రితం జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులు అందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు సమన్వయం చేయగా శాఖ అదనపు సంచాలకులు శ్రీ విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ శంకర్, ట్రైకార్ జీఎం శ్రీ శంకర్, టీ ఆర్ ఐ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Seethakka
Medaram
Medaram Jathara

More Press Releases