డా. తోటకూర ప్రసాద్ కు “ఆక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారం”

Related image

డాలస్, టెక్సాస్, అమెరికా: ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్ నగరం (ప్రిస్కో లో) పద్మవిభూషణ్, నటసమ్రాట్. డా. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా “ఆక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారం” ను అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ మరియు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అయిన ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

ఆచార్య ఇనాక్ ప్రసంగిస్తూ .. నటనలో శిఖరాగ్రా లను అందుకున్నఅక్కినేని అలనాడే పాన్ఇండియా నటుడు అన్నారు. అక్కినేని తన పాత్రల ఎంపికలో ఎంతో పరిణితి చూపేవారన్నారు. స్వయంకృషి తో ఉన్నత శిఖరాలను చేరుకున్న మహానటుడు ఆయన అన్నారు. అంతేగాక చలనచిత్ర పరిశ్రమ తెలుగునాట అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని అన్నారు. అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన జాతీయపురస్కారాన్ని అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ, అమెరికాలోని భారతీయ సమాజానికి అండగా ఉంటూ, డా. అక్కినేని పేరిట అనేక కార్యక్రమాలు చేస్తున్న డా. తోటకూర ప్రసాద్ కు అందించడం ఎంతో సముచిత నిర్ణయం అన్నారు. ఆచార్య ఇనాక్ దుశ్హాలువా, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో డా. తోటకూర ప్రసాద్ ను ఘనంగా సత్కరించి ఆకృతి సంస్థ తరపున “అక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారాన్ని” డా. తోటకూర కు అందించారు. 

పురస్కార గ్రహీత డా. తోటకూర ప్రసాద్ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన బలం, బలహీనతలు ఏమిటో గుర్తించి ఆయన పోషించిన పాత్రల ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. 
విశిష్టఅతిథిగా పాల్గొన్న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షులు డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ని ఆకృతి అమెరికాలో నిర్వహించి డా. ప్రసాద్ తోటకూర కు జాతీయ పురస్కారాన్ని అందించడం విశేషం అన్నారు. అక్కినేని ఫౌండేషన్ బోర్డు సభ్యులు రావు కల్వల అక్కినేనితో తన అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు. వి. రాంభూపాల్ రావు, ఇంద్ర కరణ్, డా. వర్ష, మోహన్, రవీందర్ మున్నగు వారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. 

ఈ సందర్భంగా స్థానిక గాయకులు చంద్రహాస్ మద్దుకూరి, ప్రభాకర్ కోట, లక్ష్మీ భారతి అక్కినేని చిత్రగీతాల విభావరిని జనరంజకంగా నిర్వహించారు.

More Press Releases