అలసట లేని గుండెను కాపాడుకుందాం
* నిరంతరం పనిచేసే కీలక అవయవం
* కొద్దిపాటి వ్యాయామం, జాగ్రత్తలతో పదిలం
* కొండాపూర్ కిమ్స్ సీటీ సర్జన్ డాక్టర్ నిసర్గ
* నేడు ప్రపంచ గుండె దినోత్సవం
హైదరాబాద్, సెప్టెంబర్ 28. 2023: మీరు ఎవరినైనా పదే పదే మోకాలు వంచమని చెబితే.. కొంతసేపటి తర్వాత ఇక అలసిపోతారు. వాళ్ల కండరాలు నొప్పిపుట్టి, ఇక ఆగిపోతారు. కానీ అదే ప్రశ్న మీరు మీ గుండెకు వస్తే.. ‘నేనెప్పుడూ అలసిపోను’ అనే సమాధానమిస్తుంది. జీవితాంతం నిరంతరాయంగా లక్షలు, కోట్ల సార్లు రక్తాన్ని పంప్ చేస్తూనే ఉంటుంది. ఇంత అద్భుతమైన అవయవం కూడా కొన్నిసార్లు విఫలమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 2 కోట్ల మందికిపైగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మరణాల్లో 80 శాతానికి పైగా నివారించదగ్గవే!! గుండె గురించి తెలుసుకోండి. దానికి మరింత ఎక్కువ పని ఇవ్వండి. అప్పుడు అది ఆ పని చేయడానికి సిద్ధపడి, మీకు మరింత మేలైన విధంగా సేవ చేస్తుంది అని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ చెప్పారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి “గుండెను ఉపయోగించండి.. గుండె గురించి తెలుసుకోండి” అనే థీమ్ తీసుకున్నారని చెప్పారు. మనకు బాగా తెలిసినవాటినే మనం ప్రేమించి, వాటిని బాగా రక్షించుకుంటామని, గుండెను కాపాడుకోవడానికి జీవితంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటిస్తూ, క్రమశిక్షణగా ఉండటమే తరుణోపాయమని అన్నారు. ఆయన చెప్పిన అంశాలిలా ఉన్నాయి..
1. మంచి ఆహారం తీసుకోండి
మన జీవనశైలి మారిపోతోంది. ఉద్యోగాల తీరు మారుతోంది. ఐటీ రంగం లాంటి చోట్ల మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. సరైన సమయానికి, సరైన ఆహారం తీసుకోవట్లేదు. కొలెస్టరాల్ ఎక్కువగా ఉండే ఆహారం, అధిక తీపి, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేస్తే ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవనం లభిస్తుంది.
2. కొద్దిపాటి వ్యాయామం చేయండి
మనుషులందరూ చక్కగా నడవగలరు. పరుగులు తీయక్కర్లేదు గానీ, కనీసం రోజూ కొంత దూరం నడవండి. రోజుకు 20 నిమిషాలు నడిస్తే గుండెకవాటాలకు బోలెడంత ప్రయోజనం ఉంటుందని రుజువైంది.
3. ఒత్తిడిని నివారించండి
ఈరోజుల్లో ఒత్తిడి లేని మనిషిని చూడటం దాదాపు అసాధ్యం. అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలనే మనం చూడాలి. ఇంటిని సంతోషంగా ఉంచుకోండి, ఆర్థిక వ్యవహారాలు సరిగా నిర్వహించుకోండి, పని వాతావరణం బాగుండేలా చూసుకోండి, రోజూ వ్యాయామం చేయండి. వీటన్నింటితో ఒత్తిడి బాగా తగ్గుతుంది.
4. ఇతర అంశాలు
యువతలో గుండెపోటు రావడానికి ధూమపానం ప్రధాన కారణం. మెరుగైన రేపటి కోసం, ఈరోజే ధూమపానం మానేయండి. మీ రక్తపోటును పరీక్షించుకోండి. రక్తపోటు పెరగకూడదంటే, ఉప్పు వాడకం తగ్గించండి. మీ కుటుంబంలో వారసత్వ లక్షణాలు బాగా ఉంటుంటే, ఈరోజే పరీక్షలు చేయించుకోండి. భారతదేశం మధుమేహానికి రాజధాని. మన దేశంలో చాలావరకు గుండెకవాటాల వ్యాధులకు, వాటివల్ల మరణాలకు మధుమేహమే ప్రత్యక్ష కారణం. మధుమేహం త్వరగా రాకుండా ఉండాలన్నా, దాని దుష్ప్రభావాల నుంచి బయటపడాలన్నా రోజూ వ్యాయామం చేయండి.
ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఈరోజే మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం.