14 నెలల శిశువు అవయవదానం!; సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
* ఆ కిడ్నీ 58 ఏళ్ల వయసున్న మహిళకు అమరిక
* సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
* వయసు, పరిమాణాల్లాంటి అడ్డంకులు తొలగిపోయిన తరుణం
హైదరాబాద్, జులై 7, 2023: అవయవదానం అనగానే అది కేవలం పెద్దలకు సంబంధించినది మాత్రమే అనుకుంటారు. కానీ, హైదరాబాద్ నగరంలో 14 నెలల వయసున్న ఓ శిశువు బ్రెయిన్‌డెడ్ కాగా.. ఆ శిశువు తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, మానవత్వంతో తమ బిడ్డ అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. సాధారణంగా పిల్లల అవయవాలు చిన్నవిగా ఉంటాయి. వాటిని పెద్దవారికి అమర్చడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ, ఈ 14 నెలల బిడ్డ నుంచి సేకరించిన కిడ్నీని ఏడేళ్లుగా డయాలసిస్ మీద ఉంటూ గుండెకు పేస్‌మేకర్ పెట్టించుకుని.. ఇలా పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న 58 ఏళ్ల మహిళకు అమర్చి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన పరికరాలు అన్నీ ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేసిన బృందానికి నేతృత్వం వహించిన కన్సల్టెంట్ యూరాలజిస్టు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.
‘‘అవయవాల మార్పిడి విషయంలో అందుబాటే అతిపెద్ద సమస్యగా ఉంది. అలాంటి తరుణంలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఇలాంటి విభిన్నమైన శస్త్రచికిత్సలు చేయడం చాలా అవసరం. వయసు, పరిమాణం లాంటి హద్దులన్నింటినీ చెరిపేస్తూ చేసిన ఈ శస్త్రచికిత్స.. రోగి జీవితానికి సరికొత్త ఆశలను అందించింది. ఇందులో అనేక అంశాలను అత్యంత జాగ్రత్తగా గమనించుకోవాల్సి వచ్చింది. సేకరించిన కిడ్నీ పరిమాణం, దాన్ని గ్రహీత శరీరం స్వీకరించే అవకాశాలు.. ఇవన్నీ చూడాలి. నిజానికి కిడ్నీ అనేది మూడు సంవత్సరాలు నిండేవరకు మనిషి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో తయారై, పనిచేస్తుంది. ఇక్కడ అవయవ మార్పిడి చేసిన తర్వాత గ్రహీత శరీరంలోనూ అది పెరుగుతుంది. కొన్ని కేసుల్లో ఇలా చిన్నవయసు వారి కిడ్నీలను పెద్ద వయసు వారికి అమర్చినప్పుడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ కేసులో మాత్రం అలాంటివి ఏమీ లేకపోవడం విశేషం. అసలు చిన్నవయసున్న శిశువు నుంచి సేకరించిన మూత్రపిండాన్ని 58 ఏళ్ల రోగికి అమర్చాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయం. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని అత్యంత విజయవంతంగా ఈ శస్త్రచికిత్స పూర్తి చేయగలిగాం.
అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో ఉన్నవారి బంధువులు అలాంటి తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత ధైర్యం కావాలి. కానీ ఆ ఒక్క నిర్ణయం వల్ల అనేక ప్రాణాలు నిలబడతాయి. ఇప్పుడు వైద్యరంగంలో పరిశోధనలు పెరిగాయి, అవయవాలను భద్రపరిచేందుకు కొత్త టెక్నిక్‌లు వచ్చాయి, అవయవదానాలను సమన్వయం చేసే సంస్థలూ ఉన్నాయి. అలాంటి సంస్థల వల్లే ఇలాంటి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి ఎన్నో విభాగాలకు చెందిన వైద్యులు తమ అమూల్య సహకారం అందించారు. వారిలో పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ పరాగ్, డాక్టర్ చేతన్, నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ దివాకర్ నాయుడు గజ్జల, డాక్టర్ వి.ఎస్. రెడ్డి, యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ గోపీచంద్, డాక్టర్ శ్రీహర్ష, ఎనస్థీషియా విభాగ వైద్యులు డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ మురళీమోహన్ ఉన్నారు. వారితో పాటు మంగాదేవి, సంజీవ్, వెంకట్, భార్గవ్ సైతం సమన్వయం విషయంలో ఎంతగానో సహకరించారు. ఈ మొత్తం విజయాన్ని చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ ఎస్. సహరయ్యకు అంకితం చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. వైద్యశాస్త్రంలో ఉన్న పరిమితులు ఒక్కొక్కటి తొలగిపోవడం పట్ల డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.