రాష్ట్రపతి జులై 4 తేదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేయండి – సి.యస్ శాంతికుమారి

Related image

హైదరాబాద్, జూన్ 26 :: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4 వ తేదీన హైదరాబాద్ పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం డా.బీఆర్ అంబెడ్కర్ సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. డీజీపీ అంజనీ కుమార్ తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ, జులై 4 సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదినం ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జరిగే మార్గాలలో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలని కోరారు. 

ఈ పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య బృందాలను నియమించడం, తగు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రోటోకాల్ ను అనుసరించి ఏవిధమైన లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ఈ సమీక్ష సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, జైన్,ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాస రాజు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి, తదితరులు హాజరయ్యారు.

More Press Releases