రాజ్ భవన్ క్యాలెండర్ ఆవిష్కరించిన గవర్నర్

Related image

నూతన సంవత్సర శుభవేళ సాధారణ ప్రజలతో గవర్నర్:

నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపు నిస్తూ, ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సాధారణ ప్రజలు గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియ చేయవచ్చని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో జనవరి ఒకటవ తేదీ ఉదయం 11 గంటల నుండి 12.30 గంటల వరకు గౌరవ గవర్నర్  రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు. అయితే కార్యక్రమానికి హాజరు కాగోరు వారిని భద్రతా పరిమితులకు లోబడి రాజ్ భవన్ లోకి అనుమతించటం జరుగుతుందని, సందర్శకులు తమతో ఎటువంటి పుష్ప గుఛ్చాలను తీసుకురారాదని పేర్కొన్నారు. ప్రధమ పౌరుడికి శుభాకాంక్షలు తెలియచేసేందుకు కేవలం మొక్కలను మాత్రమే రాజ్ భవన్ కు అనుమతించటం జరుగుతుందని మీనా వివరించారు. పాఠశాల విద్యార్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం నూతన సంవత్సర శుభవేళ రాజ్ భవన్ స్వాగతం పలుకుతుందన్నారు. మరోవైపు నూతన సంవత్సర శుభవేళ గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేసారు. 2020 సంవత్సరంలో ప్రతి పౌరుడికీ మంచి జరగాలని ఆకాంక్షించిన బిశ్వ భూషణ్, అందరికీ అయురారోగ్యాలను ప్రసాదించాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాధుని వేడుకుంటున్నట్లు వివరించారు.

రాజ్ భవన్ క్యాలెండర్ ఆవిష్కరణ:

నూతన సంవత్సర ఆగమనం నేపధ్యంలో 2020 సంవత్సరానికి గాను ప్రత్యేకంగా రూపొందించిన రాజ్ భవన్ క్యాలెండర్ ను మాననీయ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సోమవారం ఆవిష్కరించారు. ఇక్కడి గవర్నర్ ఛాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారుల సమక్షంలో గవర్నర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఏడు పేజీలతో రూపొందించిన ఈ కాల్యెండర్ లో ప్రధమ పౌరునిగా బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకార తొలి పేజీగా ముద్రించారు. కవర్ పేజీగా రాజ్ భవన్ భవనాన్ని తీసుకురాగా,  రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులతో భేటీ చిత్రాలను, గవర్నర్ పర్యటనలకు సంబంధించిన చిత్రాలను ఈ క్యాలెండర్ లో పొందుపరిచారు. ప్రభుత్వ సాధారణ సెలవు దినాలు, ఐఛ్చిక సెలవులను నిర్ధేశించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Biswa Bhusan Harichandan
Andhra Pradesh
New Year 2020

More Press Releases