రాజ్ భవన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఏపీ గవర్నర్ హరిచందన్
సగటు ప్రజలకు ప్రధమ పౌరుడిని చేరువ చేసే క్రమం: మీనా
ఇ-విజిటర్ సదుపాయం ద్వారా గవర్నర్‌ను కలుసుకోవచ్చు
అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు
రాజ్ భవన్ ను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో విభిన్న అంశాల కలయికగా నూతనంగా రూపొందించిన వెబ్ సైట్ ను అందుబాటు తీసుకురావటం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఎపి రాజ్ భవన్ కోసం నూతనంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్‌ను సోమవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ రాజ్ భవన్‌లో అవిష్కరించారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెబ్ సైట్ రూపొందించిన విధానం, అది రాష్ట్ర ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గవర్నర్ కు వివరించారు. ఇది పూర్తిగా రాజ్ భవన్ ఐటి విభాగం ద్వారానే అభివృద్ధి చేయబడిందని, వెబ్‌సైట్‌లో ఉన్న ఇ-విజిటర్ సదుపాయం ద్వారా గవర్నర్‌ను కలవాలనుకునే సందర్శకుడు ఆన్ లైన్‌లో తన వివరాలను నమోదు చేసుకుంటే, రాజ్ భవన్ వాటిని పరిశీలించిన తదుపరి, తగిన నిర్ధారణ అనంతరం సదరు నమోదుదారుకు సమాచారం పంపుతుందని మీనా గవర్నర్ కు విపులీకరించారు.
అదే క్రమంలో ఇ-మెసేజ్ ద్వారా గవర్నర్ సందేశాన్ని పొందటానికి అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, మరోవైపు ఇ-గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులను సైతం సమర్పించవచ్చని తెలిపారు. వెబ్‌సైట్‌లో గవర్నర్ ప్రసంగాలు, ఈవెంట్స్ పేజీ, ఫోటో గ్యాలరీ, ప్రెస్ రిలీజెస్ వంటి ప్రత్యేక విభాగాలు కూడా ఉన్నాయని, రోజువారీ ప్రాతిపదికన రాజ్ భవన్ అధికారులు సమాచారాన్ని అప్ డేట్ చేస్తారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో గవర్నర్ హరిచందన్ రాజ్ భవన్ సిబ్బంది బృంద ప్రయత్నాన్ని ప్రశంసించారు. వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని ఎప్పటి కప్పుడు నవీనీకరిస్తేనే దాని ఉపయోగం ఉంటుందని, రాజ్ భవన్ గౌరవాన్ని ఇనుమడింప చేసేలా ఒక కుటుంబంగా సిబ్బంది అంతా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెబ్‌సైట్‌ను http://governor.ap.gov.in/ లేదా http://rajbhavan.ap.gov.in/ ద్వారా సందర్శించవచ్చని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.