అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు: జనసేన
• రాజధాని వికేంద్రీకరణను జనసేన పార్టీ స్వాగతించదు
• విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన వెనక వైసీపీ ఇన్ సైడ్ ట్రేడింగ్
• పైశాచిక ఆనందం కోసమే అమరావతిని ముక్కలు చేస్తున్నారు
• విజయవాడ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు
13 జిల్లాలు ఉన్న చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకని జనసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్ ప్రశ్నించారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. రాజధాని వికేంద్రీకరణ కాదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడని రాజధాని వికేంద్రీకరణకు జనసేన పార్టీ ఎప్పటికీ స్వాగతించదని అన్నారు.
బుధవారం సాయంత్రం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, స్పీకర్ ప్యానెల్ సభ్యులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ “రాజధాని విషయంలో ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదిక రాకుండానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రకటన చేయడం చూస్తుంటే.. ఆయన మనసులో ఏమనుకుంటున్నారో అదే చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప .. కమిటీ నివేదికతో సంబంధం లేదని తెలుస్తోంది. రాజధాని విషయంలో ఆయనకు ముందుగానే ఓ ఆలోచన ఉంది. దాని ప్రకారమే ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు.
రాజధాని అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడం వెనుక వైసీపీ వాళ్లు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నాయకులు విశాఖ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఐదేళ్లుగా అక్కడే మకాం వేసి చాలా రకాలుగా లావాదేవీలు చేస్తున్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం గుర్తించింది. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పింది. ఇలా మూడు చోట్ల రాజధాని పెట్టడం వల్ల హైకోర్టుకు వెళ్లడానికి శ్రీకాకుళం వాసులకు చాలా కష్టమవుతుంది. అలాగే విశాఖకు రావడానికి కర్నూలు వాసులకు కష్టమవుతుంది. ముందు జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చాక దానిపై చర్చించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప నివేదిక రాక ముందే ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయకండి.
తిట్లపురాణానికే సమావేశాలు వేదికయ్యాయి:
7 రోజులు జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలు ఏ మాత్రం ఫలవంతంగా సాగలేదు. ఇరుపక్షాలు పరస్పర నిందారోపణలు, శ్రుతి మించిన రాగద్వేషాలతో ఈ సమావేశాలు ఆత్మస్తుతి – పరనింద అన్న చందాన జరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర రావాలని, సేకరించిన ధాన్యానికి మూడు రోజుల్లో డబ్బులు చెల్లించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాకినాడలో దీక్ష చేశారు. రైతుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కనీసం చర్చలేదు. టమాటా, పత్తి, పసుపు రైతుల సమస్యలపై నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటిస్తారని అనుకున్నాం అదీ జరగలేదు. కేవలం తిట్లపురాణానికే శీతాకాల సమావేశాలు వేదికయ్యాయి.
ఇసుక కొరతతో దాదాపు 50 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం వాళ్లకు సంతాపం తెలియజేయాలన్న మానవతా దృక్పథం ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం. ఆంగ్ల మాధ్యమానికి జనసేన పార్టీ వ్యతిరేకం అని మేము ఎప్పుడు చెప్పలేదు. తెలుగు మీడియం కూడా ఉండాలని మాత్రమే డిమాండ్ చేశాం. ప్రభుత్వం మాత్రం తమ మాటలను ఖాతరు చేయలేదు. దీంతో మండలిలో ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ కమిషన్ బిల్లులు వీగిపోయాయి. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానిని వైసీపీ కార్యకర్తలతో నింపేయకుండా.. అర్హత ఉన్నవారిని నియమించాలని” డిమాండ్ చేశారు.
మూడు రాజధానులు నిర్మించే శక్తి జగన్ కు లేదు : పోతిన మహేష్
అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ “రాజధాని అమరావతిని ముక్కలు ముక్కలుగా చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, పరిశ్రమలు, సేవారంగం, పెట్టుబడులు మెరుగుపరచకుండా రాజధానిని ముక్కలు చేస్తే 13 జిల్లాల్లో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా.. హైకోర్టు ఒక్కటి కడితే ఆ ప్రాంతలో అభివృద్ధి జరిగిపోతుందా..? ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తే వెనుకబాటు తనం పోతుందా..? అమరావతి రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు.. రైతు ద్రోహి. రైతు భరోసా పథకంలో కేంద్ర పథకాన్ని జోడించి వాయిదాల పద్దతి ప్రవేశ పెట్టారు.
మద్దతు ధర ఇస్తామని ధాన్యం రైతులను మోసం చేశారు. ప్రజా రాజధాని కోసం భూములిచ్చిన 28వేల మంది రైతుల త్యాగాలను అవహేళన చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి వ్యక్తి రైతు ద్రోహి కాక .. మరేమిటి? శీతాకాల సమావేశాల్లో ఒక్కటంటే ఒక్కమాట కూడా రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడలేదు. కౌలు రైతులకు భరోసా పథకం వర్తింపు గురించి మాట్లాడలేదు. అరుపులు, గొడవలు, నవ్వులతో అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూల్చివేతలకు ఇచ్చిన ప్రాధాన్యత.. ముఖ్యమంత్రి గారు నిర్మాణాలకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. అలాంటి వ్యక్తికి మూడు రాజధానులను నిర్మించే శక్తి ఉందా..?. రాష్ట్ర అభివృద్ధి మీదగానీ, ఆదాయ వనరులు పెంచాలని గానీ, చిత్తశుద్ధి ఉంటే అమరావతిని అభివృద్ధిని చేయాలని” డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్, అధికార ప్రతినిధి అక్కల గాంధీ, పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, అజయ్ వర్మ, రావి సౌజన్య పాల్గొన్నారు.