మూడేళ్ల బాలుడికి మూత్ర‌కోశంలో రాళ్లు

Related image

* విజ‌య‌వంతంగా తొల‌గించిన ఏఐఎన్‌యూ వైద్యులు
* అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో లేజ‌ర్ చికిత్స‌
 
హైదరాబాద్‌, జ‌న‌వ‌రి 22, 2023: చిన్న‌పిల్ల‌ల‌కు మూత్ర‌పిండాలు, మూత్ర‌కోశాల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం అనేది చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి. క‌రీంన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడు ఇలాగే ఇబ్బంది ప‌డుతుండ‌టంతో హైద‌రాబాద్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ)కు చెందిన వైద్యులు లేజ‌ర్‌తో విజ‌యవంతంగా చికిత్స చేసి అత‌డికి న‌యం చేశారు. ఈ వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు వివ‌రించారు.
 
‘‘క‌రీంన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడికి మూత్ర‌విస‌ర్జ‌న స‌మ‌యంలో తీవ్రంగా నొప్పి వ‌చ్చేది. దాంతో ప్ర‌తిసారీ ఏడ్చేవాడు. దాదాపు ప్ర‌తి నెల‌కోసారి తీవ్ర‌స్థాయిలో జ్వ‌రం కూడా వ‌చ్చేది. దాంతో బాలుడిని తొలుత చిన్న‌పిల్ల‌ల వైద్యుల వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా, మందులు ఇవ్వ‌డంతో తాత్కాలికంగా ఊర‌ట ల‌భించినా, మ‌ళ్లీ అవే స‌మ‌స్య‌లు రావ‌డం మొద‌లైంది. ఆ త‌ర్వాత బాలుడికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించ‌గా, అత‌డి మూత్ర‌కోశాల్లో 1.6 సెంటీమీట‌ర్ల చొప్పున రెండు రాళ్లు ఉన్న‌ట్లు తెలిసింది. దాంతో బాబును హైద‌రాబాద్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) హైటెక్ సిటీ బ్రాంచికి తీసుకొచ్చారు. ఇక్క‌డ బాలుడికి సీటీస్కాన్ చేసి చూడ‌గా, మూత్ర‌కోశంలో ఒక‌టి, మూత్ర‌నాళంలో ఒక‌టి చొప్పున రెండు రాళ్లున్నాయ‌ని, ఆ రెండింటి ప‌రిమాణం 1.6 సెంటీమీట‌ర్ల చొప్పున ఉంద‌ని తేలింది. అయితే ఇంత పెద్ద రాళ్లు ఉండ‌టం మూడేళ్ల బాలుడి విష‌యంలో చాలా స‌మ‌స్యాత్మ‌కం. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాళ్లు తీయ‌డ‌మే ఈ ప‌రిస్థితిలో పెద్ద స‌వాలు.
 
సాధార‌ణంగా పెద్ద‌వాళ్ల‌లో అయితే ఇలాంటి రాళ్ల‌ను మూత్ర‌ద్వారం నుంచి తీస్తాం. కానీ, పిల్ల‌ల్లో మాత్రం ఆ ద్వారం బాగా స‌న్న‌గా ఉండ‌టంతో, అటు నుంచి తీయాలంటే మూత్ర‌మార్గం సంకోచిస్తుంది. దానివ‌ల్ల మిగిలిన జీవితం మొత్తం ఇబ్బంది త‌ప్ప‌దు. బొడ్డు కింద మూత్ర‌కోశానికి చిన్న రంధ్రం పెట్ట‌డం ద్వారా కూడా తీయొచ్చు గానీ, దానివ‌ల్ల గాయం పెద్ద‌ద‌వుతుంది.

     బాలుడి వ‌య‌సు, సంప్ర‌దాయ చికిత్స వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఏఐఎన్‌యూ హైటెక్ సిటీ బ్రాంచిలోని సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు, ఫెసిలిటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ దీప‌క్ రాగూరి నేతృత్వంలో డాక్ట‌ర్ ఎండీ తైఫ్ బెండిగెరి, పీడియాట్రిక్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ ప్ర‌భు క‌రుణాక‌ర‌న్‌, డాక్ట‌ర్ లీలాకృష్ణ‌, చీఫ్ ఎన‌స్థీషియాల‌జిస్టు డాక్ట‌ర్ నిత్యానంద్ లంకాతో కూడిన బృందం.. లేజ‌ర్ లిథోట్రిప్సీ ద్వారా ఎండోస్కొపిక్ శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించింది. సాంకేతిక ప‌రిజ్ఞానం మెరుగుప‌డ‌టం, ఎండోస్కొపిక్ ప‌రిక‌రాలు బాగా చిన్న‌వి అవుతుండ‌టంతో.. ప్ర‌త్యేకంగా పిల్ల‌ల కోస‌మే డిజైన్ చేసిన ప‌రిక‌రాల‌తో, అత్యాధునిక థులియం ఫైబ‌ర్ లేజ‌ర్‌తో చికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం. ఈ ప‌రికరాల సాయంతో రాళ్ల‌న్నీ పూర్తి పొడిలా అయిపోయాయి. వాటిని ఒక స‌క్ష‌న్ మిష‌న్‌తో పూర్తిగా తొల‌గించాము. మొత్తం శ‌స్త్రచికిత్స 45 నిమిషాల్లో పూర్త‌యింది, అందులో ఎలాంటి దుష్ప్ర‌భావాలూ లేవు. మ‌ర్నాడే బాలుడిని డిశ్చార్జి చేసేశాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌గలుగుతున్నాడు’’ అని వైద్యులు వివ‌రించారు.
 
జీవ‌క్రియ‌ల్లోని కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, లేదా పుట్టుక‌తో వ‌చ్చే లోపాల వ‌ల్ల పిల్ల‌ల‌కు మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో స‌మ‌ర్ధ‌మైన‌, సుర‌క్షిత‌మైన చికిత్స కోసం నిపుణులైన సూప‌ర్ స్పెషాలిటీ వైద్యులు అవ‌స‌రం అవుతారు. ఏఐఎన్‌యూ ప్ర‌త్యేకంగా ఇలాంటి చికిత్స‌ల విష‌యంలో పేరెన్నికగ‌న్న‌ది.

More Press Releases