గ్రేటర్‌లో పాదాచారులకు మరింత సౌకర్యవంతంగా ఫుట్‌పాత్‌లు: మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్‌లో పాదాచారులకు మరింత సౌకర్యంగా ఉండేందుకుగాను అన్ని కమర్షియల్ రహదారులలో ఉండే షాపులన్నింటికి ప్రహరీగోడలు లేకుండా చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలు, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ పనులపై నేడు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ లతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ నగరంలో ఫుట్‌పాత్‌ల విస్తరణ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలని, ప్రతి జోన్‌లో కనీసం పది కిలోమీటర్ల మేర నూతనంగా ఫుట్‌పాత్‌లను నిర్మించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లు, వాక్ -వే లను మరింత విస్తరించడంతో పాటు ప్రతిజోన్‌లో పది కిలోమీటర్ల రహదారులను వేయాలని స్పష్టం చేశారు.
జిహెచ్ఎంసి పరిధిలో అమలవుతున్న పలు ఇంజనీరింగ్ పనుల పురోగతిని తెలిపే ప్రత్యేక డ్యాష్ బోర్డును ఏర్పాటుచేసి ప్రతి పనుల పురోగతి వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. గ్రేటర్‌లో వంద ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులను మంజూరు చేయడం జరిగిందని, వీటి నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు గతంలో నిర్దేశించిన బస్-బేలు, బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తిచేయాలని పేర్కొన్నారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ తో పాటు ఇతర ఫ్లైఓవర్ల పై వేగ నియంత్రణ, ఇతర రక్షణ చర్యలపై స్వతంత్ర కమిటిని నియమించడం జరిగిందని, ఈ కమిటి అధ్యయనం చేసిన అనంతరం ఇచ్చే నివేదికను అనుసరించి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను తెరవాలని పేర్కొన్నారు.
నగరంలో ఇటీవల నిర్వహించిన నిరుపయోగ వస్తువల సేకరణ స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగడం, మెహిదీపట్నంలో అన్ని విభాగాలతో చేపట్టిన స్వచ్ఛ వార్డు కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు రావడం పట్ల అభినందించారు. ఈ స్వచ్ఛ వార్డు కార్యక్రమాన్ని అన్ని వార్డులలో చేపట్టాలని ఆదేశించారు. ఈ డిసెంబర్ మాసాంతం వరకు ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నగరంలో తిరిగి నైట్ స్వీపింగ్‌ను ప్రారంభించాలని అన్నారు.