డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడానికి, యుద్దప్రాతిపదికన చర్యలు – ప్రభుత్వం ఆదేశం
పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ....
రూ.18 వేల కోట్ల వ్యయంతో 2.91 లక్షల ఇళ్ళ నిర్మాణం.
ప్రతిపాదించిన ఇళ్ళ నిర్మాణం దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితముగా ఇచ్చేందుకు బృహత్తర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 2.91 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాలిటీలలో, గ్రామాలలో ఇప్పటికే అన్ని ఇళ్ళు పూర్తి దశకు చేరుకున్నాయి. వాటికి మౌళిక సదుపాయాలు అయిన రోడ్డు,విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల కు అప్పగించింది. 2023 జనవరి 15 వ తేదీ లోపల ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే పూర్తి చేయించి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు
చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అద్దె భవనాల్లో నివసిస్తున్న వారు అర్హులని తెలిపారు. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపించాలని క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలన్నారు. అనంతరం అట్టి జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా పంపించడం జరుగుతుందన్నారు. కట్టిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా జిల్లాలలో లక్ష్యంగా పెట్టుకున్న రెండుపడకల ఇళ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటికే టెండర్ పూర్తి అయి నిర్మాణ దశలో ఉన్న వాటిని జనవరి 15లోగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మౌళిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారం వారం సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పగలు పనికి పోయినా రాత్రి మనది అనే ఓ చిన్న గూడు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలకు కోటి వెలుగులు పంచుతూ ...560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్ తో పాటు రెండు బాత్ రూంలతో , డబుల్ బెడ్ రూమ్ఇ ళ్ళని ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. సొంత ఇళ్ళు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నాను అంటూ నిలబడ్డ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఓ వరం... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గృహ నిర్మాణ పథకం లో ఇప్పటి వరకు 2,91,057 గృహములను మంజూరీ చేయడం జరిగినది.
మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు చాలా వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. కొన్ని చోట్ల లబ్దిదారులకు అందజేయడం కూడా పూర్తి అయ్యింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ డిజైన్, లే-ఔట్లలో, సృజనాత్మకత మరియు ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మరియు పారదర్శకత పాటించుచున్నందుకు “Online Project Monitoring System (OPMS)” కు జాతీయ స్థాయిలో ఇటీవల HUDCO అవార్డులుకూడా ప్రభుత్వం దక్కించుకోవడం జరిగింది. ఈ పథకం అమలును అధ్యయనం చేయుటకు రాష్ట్రంను సందర్శించిన జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు మరియు నిపుణులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అధికారులు అధ్యయనం నిమిత్తం రాష్ట్రంలో పర్యటించి ఉన్నత ప్రమాణాలతో నూతన సాంకేతిక పరిజ్ఞానముతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి, ప్రశంసిస్తూ వారి రాష్ట్రాలలో కూడా అమలు పరుచుటకు చర్యలు
తీసుకొంటున్నారు.
---------------------------------------------------------------------------------------------------------------------------------కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీచేయనైనది.