హైదరాబాద్ నగరంలో దశాబ్దంలో రెట్టింపైన బ్రెస్ట్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు
* ఇంటర్నెట్ ప్రభావం, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం
* మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కేసులు పెరగడానికి ప్రధాన కారణం
* మచ్చలేని శస్త్రచికిత్స చేసిన ఎస్ఎల్ జీ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్, November 07, 2022: వక్షోజాలు చిన్నగా ఉండటం కొన్నిసార్లు సామాజిక అపోహలకు, ఆత్మన్యూనతకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. భారతదేశంలో ప్రబలంగా ఉన్న సామాజిక పరిస్థితులు, పితృస్వామ్యం కారణంగా ఈ పరిస్థితి తరచుగా తలెత్తుతుంది. హైదరాబాద్ లో ఒక దశాబ్దంలో బ్రెస్ట్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు రెట్టింపు కావడానికి ఇవే ప్రధాన కారణం.
20లు, 30లలో ఉన్న మహిళల్లో చాలామంది తమ శరీర రూపాన్ని మెరుగుపరచుకోడానికి బ్రెస్ట్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఎంచుకుంటున్నారని నగరంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రి అయిన ఎస్ఎల్ జీ ఆస్పత్రి వైద్యులు గమనించారు. వక్షోజాలు చిన్నగా ఉండటం వల్ల తమ ఆకర్షణ తగ్గుతుందని భావిస్తారు. దాంతోపాటు, తమకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి కూడా తగిన ఆత్మవిశ్వాసం వారిలో ఉండదు. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇది అడ్డంకిగా ఉండవచ్చు.
ఈ అంశంపై ఎస్ఎల్ జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంధ్యా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, "ఉద్యోగాలు చేసుకోడానికి బయటకు వచ్చే యువతులు కొన్నిసార్లు తమ శరీర కొలతల గురించి ఆందోళన చెందుతారు. ఆకర్షణీయంగా కనిపించాలంటే తమ వక్షోజాలు పెద్దవిగా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయాల మీద ఇంటర్నెట్ లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. అలాగే సోషల్ మీడియా కూడా వీరిని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ఒక దశాబ్దం క్రితం హైదరాబాద్ లో నెలకు గరిష్ఠంగా 10-15 వక్షోజాల పరిమాణం పెంపు శస్త్రచికిత్సలు జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 25-30కి పెరిగింది. మరింత మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడంతో, రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది" అని చెప్పారు.
డాక్టర్ సంధ్యా బాలసుబ్రమణ్యం ఇటీవల వక్షోజాల పరిమాణం పెంపు కోసం ఒక 27 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ట్రాన్స్ యాక్సిలరీ ఎండోస్కోపిక్ (చంక నుంచి) వక్షోజాల ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆమె వక్షోజాల పరిమాణం పెరగాలని సంప్రదించారు. ఈ శస్త్రచికిత్స వల్ల అది సహజంగా కనిపిస్తుంది తప్ప, కృత్రిమంగా కనిపించదు. వక్షోజాల పరిమాణం పెంచడానికి (ఎన్ హాన్స్ మెంట్ లేదా ఆగ్మెంటేషన్) వక్షోజ గ్రంధి లేదా ఛాతీ కండరాల కింద సిలికాన్ ఇంప్లాంట్లను ఉంచుతారు. సాధారణంగా ఇది వక్షోజాల మడతకు దిగువన కోత పెట్టి చేస్తారు. అయితే ట్రాన్స్ యాక్సిలరీ విధానం ద్వారా మచ్చ కనపడకుండా చేయొచ్చు. దానివల్ల మెరుగైన వక్షోజాలు మచ్చలేకుండా సహజంగా కనిపిస్తాయి.