రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ

Related image

• మన పండగ.. మన సంస్కృతి.. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ..
 30 రకాల రంగుల చీరలు, 240 డిజైన్లు...
• 800 కలర్ కాంబినేషన్లు...
• రూ. 340 కోట్ల వ్యయంతో కోటి బతుకమ్మ చీరలు పంపిణీ....

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ చేనేత సహకార సంస్ధ ( టెస్కో) ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది. 240 పైచిలుకు వెరైటీ డిజైనర్ లతో చీరలు తయారు చేశారు. ఒక కోటి 18 లక్షల చీరలు మహిళలకు పంపిణీ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర
స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటీవల మన రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ
మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామా రావు సిరిసిల్ల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు.

      
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల‌కు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన‌ బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనంగా భావించే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడ బిడ్డల కోసం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారు ప్రతి ఏడాది కోట్ల వ్యయంతో ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. ఈ ఏడాది రూ. 340 కోట్ల వ్యయంతో ఒక కోటి 18 లక్షల చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. బతుకమ్మ చీరల తయారీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్ ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నల తో నేయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా లబ్దిదారులకు భారీగా పంపిణీ చేస్తున్నారు. 

    
ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు మరింత ఆకర్శణీయంగా వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రతి బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైన్లలో చీరలు ఉచితంగా అందిస్తోంది. 
    బతుకమ్మ పండుగకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ చీరలు 24 వ తేదిలోపు ఆయా బస్తీలు, వార్డుల వారీగా, పూర్తి చేయాలన్నారు.

      గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీచేస్తుంది. నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది చీరలను ప్రభుత్వం అందజేస్తోంది. కాగా, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఆడబిడ్డకు కొత్త చీరను కానుకగా అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీన్ని ఒక శుభకార్యంగా భావించి ఏటా ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన ఆడపడుచులకు చీరలను కానుకగా అందజేస్తోంది. 

     రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల చేనేత కార్మికులతో మరమగ్గాలపై ప్రత్యేకంగా తయారు చేయించింది. ఈ చీరల్లో వైవిధ్యం ఉట్టిపడేలా ఈ సారి కొత్త రంగుల్లో నేయించారు. అంతే గాకుండా ప్రతి చీరల్లోనూ బ్లౌజు కూడా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన చీరలు కాకుండా జిహెచ్ఎంసి, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వార్డుల వారిగా విభిన్నంగా రంగులు, డిజైన్ల చీరలను పంపిణీ చేస్తున్నారు. ఈ బతుకమ్మ చీరలు తెల్లరేషన్కా ర్డుదారులకే అందజేస్తున్నారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిల్లోనే సుమారు 10.46 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 

    రేషన్ డీలర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ చీరలను పొందేందుకు మహిళలకు విధిగా ఆహార భద్రత కార్డు ఉండాలి. 18 ఏళ్ల వయస్సు పై బడి ఉండాలి. 

     బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ మహిళలు ఘనంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే బతుకమ్మ ఆడటానికి వెళ్లే మహిళలు తీరొక్క రంగు చీరల్లోఅందంగా ముస్తాబవ్వడానికి ప్రభుత్వం వాటిని తయారు చేయించింది. తెలంగాణ ఆడ బిడ్డలు గొప్పగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేలా కొన్ని సంవత్సరాలుగా వారికి ఉచితంగా చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 
   గత సంవత్సరం 26 డిజైన్లతో బతుకమ్మ చీరలను టెస్కో అధికారలను తయారు చేయించగా ఈ సంవత్సరం 240 పై చిలుకు వెరైటీ డిజైన్లను బతుకమ్మ చీరల తయారీలో వినియోగించారు. 

    ఈ సంవత్సరం వెండి, బంగారు, జరీలతో పాటు డాబి, జాకాడ్అం చుల డిజైన్లతో చీరల పంపిణీకు జౌళిశాఖ సిద్ధం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహిళల కోసం 9 గజాల చీరలను ప్రత్యేకంగా 8 లక్షల చీరలను ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది.

         ------------------------------------------------------------------------------------------------------------శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్వా రిచే జారిచేయనైనది.

More Press Releases