గుర్తున్నా.... గుర్తుప‌ట్ట‌లేరు- అంత‌ర్జాతీయ అల్జీమ‌ర్స్ దినోత్స‌వం- సెప్టెంబ‌ర్ 21న

Related image

డాక్ట‌ర్‌. జ‌య‌శ్రీ‌
క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్‌
కిమ్స్ హాస్పిట‌ల్స్ సికింద్రాబాద్

అల్జీమ‌ర్స్ వ్యాధి ఒక న్యూరోడెజెనరేటివ్ డిజార్డ‌ర్‌. ఈ వ్యాధి 65 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన వారిలో సాధార‌ణంగా క‌నిపించే ఒక ర‌క‌మైన డిమెన్షియా. ఈ వ్యాధిలో మ‌తిమ‌రుపుతోపాటు వ్యక్తి ప్ర‌వ‌ర్త‌న‌, మాట్లాడే విధానం, గ్ర‌హ‌ణ‌శ‌క్తి, ఆలోచ‌న విధానంలాంటి అంశాల‌లో కూడా మార్పులు వ‌స్తాయి. ఈ వ్యాధి సోకిన వారికోసం, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకురావ‌డానికి ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 21వ తేదీని అంతర్జాతీయ అల్జీమ‌ర్స్ దినోత్స‌వంగా నిర్వ‌హిస్తారు.   ఈ సంవ‌త్స‌రం   "డిమెన్షియా తెలుసుకొండి, అల్జీమర్స్ తెలుసుకొండి" అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు. 
 
విశ్వ‌వాప్త స‌మ‌స్య‌గా అల్జీమ‌ర్స్‌


అల్జిమర్స్ వ్యాధి ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా   అరవయ్యేళ్లు నిండిన వృద్ధుల జనాభా సుమారు 90 కోట్లుగా ఉంటే, వారిలో దాదాపు 4.68 కోట్ల మంది అల్జిమర్స్ బాధితులే. అల్జిమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ అంచనా మేరకు 2030 నాటికి ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య 7.47 కోట్లకు, 2050 నాటికి 13.15 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 99 లక్షల అల్జిమర్స్ కేసులు నమోదవుతున్నాయి. అంటే, ప్రతి 3.2 సెకన్లకు ఒక కొత్త కేసు చొప్పున నమోదవుతున్నట్లు లెక్క. ఖండాల వారీగా చూసుకుంటే ఏటా ఆసియాలో అత్యధికంగా 49 లక్షలు, యూరోప్‌లో 25 లక్షలు, అమెరికాలో 17 లక్షలు, ఆఫ్రికాలో 8 లక్షల అల్జిమర్స్ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. అలాగని అల్జిమర్స్ వ్యాధేమీ శరవేగంగా విస్తరించే మహమ్మారి కాదు. వెనువెంటనే ప్రాణాలు తీసే వ్యాధి కాదు. 
 
 మితిమీరే మతిమరపు

మతిమరపు మానవ సహజ లక్షణం. సవాలక్ష చిన్నా చితకా సంగతులను మనం ఎప్పటికప్పుడు మరచిపోతూనే ఉంటాం. నష్టమేం లేదు. పరీక్షల్లో కీలకమైన ప్రశ్నలకు సమాధానాలనూ మరచిపోతూ ఉంటాం. కొంత నష్టమే. అయినా మరేం ఫర్వాలేదు. ఎలాగోలా నెట్టుకొచ్చేస్తాం. మతిమరపు ఇదే మోతాదులో ఉంటే, కొద్దో గొప్పో తాత్కాలిక కష్టనష్టాలు ఎదురైనా, కొంచెం తెలివిగా వాటిని ఏదోలా అధిగమించేస్తాం. అయితే, వయసు మళ్లి, శక్తులన్నీ ఉడిగిపోతున్న దశలో తెలివి తెల్లారిపోయే స్థాయిలో ముంచుకొచ్చే మతిమరపుతో వేగం అంత వీజీ కాదు. అలాంటి మతిమరపుతో బాధపడే మనిషి ఒకరు ఇంట్లో ఉంటే, ఆ కుటుంబం మొత్తం పడే ఇబ్బందులు అలాంటిలాంటివి కాదు, ఒంట్లో సత్తువ క్షీణించి, జ్ఞాపకశక్తి నశించిన మనుషులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది.

అడుగడుగునా ఆసరాగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ల మతిమరపు మామూలు స్థాయిలో ఉండదు. వాళ్లు నిమిషం కిందటి సంభాషణను కూడా మరచిపోవచ్చు. కన్నపిల్లల పేర్లు మరచిపోవచ్చు. తేదీలు, వారాలు వంటివి ఎవరైనా మరచిపోతారు. అది సహజమే. అల్జిమర్స్ వల్ల మతిమరపు తలెత్తితే, ఏకంగా తేదీలు, వారాలు వంటివి ఉంటాయన్న విషయాన్నే మరచిపోతారు. అలాగని మెదడంతా ఫార్మాట్ చేసిన హార్డ్‌డిస్క్‌లా శూన్యంగా మారిపోదు. చిన్నప్పుడు గోలీలాడుకున్న జ్ఞాపకాలు అకస్మాత్తుగా వాళ్లకు గుర్తుకు రావచ్చు. అయితే, రోజూ వేసుకోవాల్సిన మందు గోలీల సంగతి వాళ్లకు గుర్తుండకపోవచ్చు.
 
ఇవీ లక్షణాలు

అరవయ్యేళ్లు దాటిన వారిలో మతిమరపు లక్షణాలు ఎంతో కొంత కనిపిస్తాయి. మెదడు పరిమాణం కొంత కుంచించుకుపోవడం వల్ల అలాంటి లక్షణాలు సహజమే. అల్జిమర్స్ వ్యాధి సోకిన వారిలో అంతకు మించిన లక్షణాలు కనిపిస్తాయి. అల్జిమర్స్ వ్యాధి సోకిన వారిలో సర్వసాధారణంగా కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు...
*  తాళాలు, కళ్లద్దాలు వంటివి ఎక్కడ పెట్టామో ఒక్కోసారి మరచిపోతూ ఉండటం అరుదుగానైనా దాదాపు అందరికీ అనుభవమే. అలమరాలో ఉంచాల్సిన కళ్లద్దాలను ఒక్కోసారి ఏ టీపాయ్ మీదనో పెట్టి మరచిపోతూ ఉంటాం. హ్యాంగర్‌కు వేలాడదీయాల్సిన తాళాలను ఏ టేబుల్ మీదో పెట్టి మరచిపోతూ ఉంటాం. అల్జిమర్స్ సోకిన వాళ్లలో ఈ పరిస్థితి మరింత చిత్రంగా ఉంటుంది. కళ్లద్దాలను ఏ ఫ్రిజ్‌లోనో భద్రంగా దాచిపెట్టి, ఆ విషయాన్ని మరచిపోతారు. ఇంటి తాళాలను ఇంచక్కా ఏ డిష్‌వాషర్‌లోనో పెట్టి మరచిపోతారు.

* ఇంట్లోనే ఉండే కుటుంబ సభ్యుల పేర్లు కూడా మరచిపోతుంటారు. రోజూ చూసే వస్తువులను మరచిపోతుంటారు. మాట్లాడేటప్పుడు పదాల కోసం తడుముకుంటుంటారు. వాక్యాన్ని పూర్తి చేయడానికి ప్రయాసపడుతుంటారు.

* కొద్ది నిమిషాల కిందటే జరిపిన సంభాషణను కూడా మరచిపోతుంటారు. వాళ్లు మిమ్మల్ని ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. మీరు సమాధానం చెబుతారు. అంతలోనే మరచిపోయి మళ్లీ అదే ప్రశ్న అడుగుతారు. ఓపికగా మీరు మళ్లీ సమాధానం చెబుతారు. కాసేపటికి మిమ్మల్ని మళ్లీ అదే ప్రశ్న అడుగుతారు.

* మామూలు సమయం కంటే ఎక్కువ సేపు నిద్రలో గడిపేస్తూ ఉంటారు. మెలకువగా ఉన్న సమయంలోనూ పెద్దగా పనులపై ఆసక్తి చూపరు. వాళ్లకు అంతకు ముందు బాగా ఇష్టమైన పనులు కూడా చేయడాన్ని మానుకుంటారు. టీవీ ముందు కూర్చుంటే, అనాలోచితంగా గంటల తరబడి అక్కడే గడిపేస్తారు. అయితే, టీవీలో కనిపించేవి, వినిపించేవి ఏవీ వాళ్ల తలకెక్కవు.

* అంతకు ముందు బాగా అలవాటైన ప్రదేశాలకే వెళ్లినా, గందరగోళంలో పడి తరచు తోవ తప్పిపోతూ ఉంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాళ్లు కేవలం వీధి చివర వరకే వెళ్లినా, తిరిగి ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడతారు.

* వాతావరణంతో సంబంధం లేకుండా దుస్తులు వేసుకుంటూ ఉంటారు. బయట ఎండ మండిపడే వేళలో ఇంట్లో తాపీగా స్వెట్టర్ వేసుకుని, మెడకు మఫ్లర్ బిగించుకుంటారు. చలి వణికిస్తున్న వేళలో హాయిగా లాల్చీ పైజమా వేసుకుని ఆరుబయట వాలుకుర్చీలో కూర్చుంటారు.

* బ్యాంకు ఖాతాలు, చెక్‌బుక్‌లు వంటివేవీ సొంతగా నిర్వహించుకోలేరు. అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన జమాఖర్చుల లెక్కల వంటివేవీ వాళ్లకు గుర్తుండకుండాపోతాయి.   

* పెద్ద కారణమేదీ లేకుండానే భావోద్వేగాలలో తీవ్రమైన మార్పులకు గురవుతూ ఉంటారు. పట్టరాని కోపంతో ఊగిపోవచ్చు లేదా నియంత్రించుకోలేని దుఃఖంతో కుమిలిపోవచ్చు. తరచుగా భావోద్వేగాలపై పట్టు కోల్పోతూ ఉంటారు.
 
మూడు దశలు

అల్జిమర్స్ వ్యాధి ఒకేసారి మీదపడే మహమ్మారి వ్యాధి కాదు. మెదడులోని జీవకణాలు క్రమంగా క్షీణించడం వల్ల తలెత్తే వ్యాధి ఇది. కణాల క్షీణత నిదానంగా జరుగుతున్నట్లే, ఈ వ్యాధి లక్షణాలు కూడా చాలా నెమ్మదిగా, నిదానంగా కనిపించడం ప్రారంభిస్తాయి. లక్షణాల స్థాయీభేదాలను బట్టి అల్జిమర్స్ వ్యాధిని మూడు దశలుగా విభజించుకోవచ్చు.

1. వ్యాధి మొదలైన తొలి దశ రెండు నుంచి నాలుగేళ్ల వరకు కొనసాగుతుంది. ఈ దశలో లక్షణాలను స్పష్టంగా గుర్తించడం కొంచెం కష్టమే. వ్యాధి తొలిదశలో ఉన్నవారు తరచు మతిమరపు లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. తాజా సంఘటనలను కూడా మరచిపోతుంటారు. తెలిసిన వారి పేర్లు వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోతుంటారు. మానసికంగా కుంగిపోతూ ఉంటారు. తరచుగా భావోద్వేగాలపై అదుపు కోల్పోతుంటారు. వాహనాలు నడపడం, వాక్యాలు రాయడం వంటి ఏకాగ్రత అవసరమైన పనుల్లో గందరగోళానికి గురవుతుంటారు.

 2. రెండో దశలో వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగానే కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి క్షీణతలో వేగం పెరుగుతుంది. మతిమరుపు మితిమీరడం మొదలవుతుంది. వ్యక్తిగత వివరాలు సైతం మరచిపోతారు. సన్నిహితులైన బంధు మిత్రులు, కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేరు. తాజా సంఘటనలకు, స్థల కాలాలకు సంబంధించి గందరగోళానికి గురవుతుంటారు. తెలిసిన ప్రదేశాల్లోనే తప్పిపోయినట్లుగా ప్రవర్తిస్తుంటారు. నిద్రలో తరచు అవరోధాలకు గురవుతుంటారు. భావోద్వేగాలు తరచు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి వింత వింత భ్రమలకు లోనవుతూ ఉంటారు. విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కీళ్లు బిగుసుకుపోయి, కదలికల్లో వేగం తగ్గుతుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. రోజువారీ పనుల్లో కూడా ఎవరో ఒకరి సహాయం కావాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు గుర్తుచేస్తే గాని ఏ పనీ చేసుకోలేరు. ఈ దశ దాదాపు రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు కొనసాగుతుంది.

3. మూడో దశలో పరిస్థితి మరింత క్షీణిస్తుంది. గతానికి, వర్తమానానికీ తేడాను గుర్తించడంలో సైతం గందరగోళపడతారు. జ్ఞాపకశక్తి మరీ క్షీణిస్తుంది. ఏ విషయాన్నీ ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పలేరు. ఎదుటివారు చెప్పిన విషయాలనూ అర్థం చేసుకోలేరు. స్వీయ సంరక్షణను చూసుకోలేరు. కీళ్లు బాగా బిగుసుకుపోవడంతో నడవడానికి కూడా ఇబ్బందిపడతారు. దాదాపు మంచానికే పరిమితమవుతారు. ఆహారాన్ని మింగడానికి కూడా ఇబ్బందిపడతారు. ప్రవర్తనలో, భావోద్వేగాలలో విపరీతమైన మార్పులు వస్తాయి. తరచు భ్రమలకు లోనవుతూ ఉంటారు. సంధిప్రేలాపనలు కూడా రావచ్చు. ఇరవై నాలుగు గంటలూ వైద్య పర్యవేక్షణలో ఉంచాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. సాధారణంగా ఈ దశ ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. కొందరిలో ఇది మరింత కాలం కూడా కొనసాగవచ్చు.
 
ఇలా గుర్తిస్తారు

అల్జిమర్స్ వ్యాధిలో మాదిరి మతిమరపు లక్షణాలు కొన్ని ఇతర పరిస్థితుల్లో కూడా కనిపించవచ్చు. నాడీ సంబంధిత సమస్యలు, తలకు తీవ్ర గాయాలు, పక్షవాతం, మూర్ఛ, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు సోకినప్పుడు, మెటబాలిక్ సమస్యలు, కిడ్నీల వైఫల్యం, లివర్ వైఫల్యం వంటి సమస్యలు తలెత్తినప్పుడు, డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, మద్యం, మాదకద్రవ్యాలు మితిమీరి వాడినప్పుడు, మానసిక వ్యాధులకు గురైనప్పుడు, మెనెంజైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు కూడా అల్జిమర్స్ వ్యాధిని తలపించే మతిమరపు లక్షణాలు కనిపించవచ్చు. అందువల్ల అల్జిమర్స్ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి వైద్యనిపుణులు వ్యాధి లక్షణాలను పరిశీలించడమే కాకుండా, కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు కూడా జరుపుతారు. కుటుంబ సభ్యుల ద్వారా రోగి చరిత్రను తెలుసుకుంటారు. రోగి ఏకాగ్రత స్థాయిని, గ్రహింపు శక్తిని, జ్ఞాపక శక్తిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. జన్యుపరమైన, వైద్యపరమైన కారణాలను కనుగొనేందుకు బ్రెయిన్ ఇమేజింగ్, రక్తపరీక్షలు వంటివి నిర్వహిస్తారు. అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాతే రోగికి అల్జిమర్స్ వ్యాధిపై ఒక నిర్ధారణకు వస్తారు.

ఈ వ్యాధితో బాధ‌ప‌డేవారిని చిన్న‌చూపు చూడ‌కుండా... జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

More Press Releases