రీసర్వే ప్రాజెక్టుపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
రీసర్వే ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంల మధ్య ఒక అవగాహన ఒప్పందాన్ని కుదిరింది. హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యలయం వేదికగా సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వం తరుపున సర్వే శిక్షణా సంస్ధ వైస్ ప్రిన్సిపల్ కుమార్ , విశ్వవిద్యాలయ ఉప కులపతి అచార్య బాల కిష్టా రెడ్డి అవగాహనా పత్రాలను మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకంకు చట్టపరమైన మద్దతును అందించడం కోసం ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. దాదాపు 100 సంవత్సరాల తరువాత వ్యవసాయ వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సెప్టెంబరు 2023 నాటికి పూర్తి కానుంది.
రాష్ట్రంలోని ప్రతి భూమిని జియో కోఆర్డినేట్‌లతో సర్వే చేసి నంబర్లు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలో ప్రాజెక్ట్‌కు చట్టపరమైన పత్రాలను రూపొందించడం, సమీక్షించటంతో సహా పలు అంశాలలో మద్దతు తప్పనిసరి. మరోవైపు శిక్షణ ఇవ్వడం, లీగల్ రీసెర్చ్ చేపట్టడం. భూ వివాదాలను పరిష్కరించడం, రైతులలో చట్టపరమైన అవగాహనను వ్యాప్తి చేయటం వంటి ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు చట్టపరమైన మద్దతు కోసం నల్సార్‌ను భాగస్వామిని చేయాలని ఇప్పటికే సూచించగా , సర్వే కమీషనర్ సిద్దార్ధ జైన్ తదనుగుణమైన ప్రణాళికను అమలు చేసారు. ఈ ఒప్పందం ఫలితంగా ప్రాజెక్ట్ అమలులో పాల్గొన్న భాగస్వాములకు శిక్షణ అందించటంతో పాటు, రీసర్వే ప్రాజెక్ట్‌ను బలోపేతం చేసి, సృజనాత్మకంగా అమలు చేయడం కోసం వినూత్న పైలట్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తారని సిద్దార్ధ జైన్ తెలిపారు.
ఒప్పందంలో భాగంగా రీసర్వే ప్రాజెక్ట్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు మెటీరియల్‌ని సిద్ధం చేసి, వ్యాప్తికి అవసరం అయిన చర్యలు తీసుకుంటారు. సర్వేతో పాటు భూమి హక్కులు, భూమి చట్టాలు, భూ వివాద పరిష్కారాలకు సంబంధించిన అంశాలపై పరిశోధనను సైతం నల్సార్ చేపడుతుంది. రైతుల చట్టపరమైన హక్కులకు సంబంధించిన అన్ని అంశాలలోను ఈ ఒప్పందం క్రీయాశీలకం కానుంది. ఉపన్యాసాలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, సమావేశాల నిర్వహణ, డాక్యుమెంటేషన్, పాలసీ అడ్వకేసీ కార్యకలాపాలను చేపడతారు. భూ వివాదాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను సూచించి, పార్టీలు పరస్పరం అంగీకరించే ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు. అవసరమైన విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని సిద్ధం చేయటం కూడా అవగాహనలో భాగంగా ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నల్సార్ నుండి అచార్య సునీల్ కుమార్ , సర్వే అధికారులు పాల్గొన్నారు.