అధికార వ్యవహారాల్లో తెలుగునే తప్పనిసరిగా ఉపయోగించాలి- అధికార భాష సంఘం
హైదరాబాద్, సెప్టెంబర్ 3 :: రాష్ట్రంలో జరిపే అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలనన్నింటినీ ప్రజల భాష తెలుగులోనే జరపాలని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు . బడి పలుకుల భాషకన్నా పలుకుబడులు భాషకే ప్రాధాన్యత నివ్వాలన్న ప్రజాకవి కాళోజి జయంతి సెప్టెంబర్ 9 న తెలంగాణా భాష దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలు విధిగా తెలుగులోనే నిర్వహిస్తూ సామాన్య ప్రజానీకానికం చెంతకు పాలనా అంశాలు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా సాహితీ దిగ్గజాల జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అధికార భాష అయినా తెలుగుకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో తప్పని సరిగా తెలుగునే వాడాలని జిల్లా కలెక్టర్లను కోరుతూ రాసిన లేఖలో అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి కోరారు.
-----------------------------------------------------------------------------------------------------------------------
కమీషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ చే విడుదల చేయనైనది.