పుస్తకాలు సామాజిక కార్యకర్తలు
గంగా జమున తెహజీబ్ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి దేశమంతా వ్యాపించాలని కోరుకున్న మహాత్మాగాంధీ సందేశాన్ని ఈతరం దగ్గరకు తీసుకపోయేందుకు ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమయ్యిందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
ఎల్.బి.స్టేడియంలో ఆదివారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కులం, మతం పేరున సమాజాన్ని ముక్కలు చేసే యత్నాలు చేసే విషభావజాలాలను తిప్పికొట్టేందుకు పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. మనిషిని మనిషి ప్రేమించే సామాజికతత్వాన్ని లౌకికతత్వాన్ని ఎద ఎదలో నాటటానికి పుస్తకాలు సామాజిక కార్యకర్తల్లా పనిచేస్తాయని పేర్కొన్నారు. మహాత్ముని ఆశయాలను వజ్రోత్సవాల సందర్బంగా పునశ్చరణ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిష్టం మేరకు జరిగిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమైందన్నారు. మనుషులందరూ ఒక్కటేనన్న సమానత్వం గీతంగా నిలిచిన తెలంగాణ సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకోవాల్సిన భాద్యత పౌరసమాజంపై ఉందని వివరించారు.
మానవత్వాన్ని మత సామరస్యాన్ని చాటిచెప్పే గాంధీ భోదనలను ఈతరం భుజాలకెత్తుకున్నప్పుడే భవిష్యత్ భారతానికి సమైక్యత మరింత పటిష్టంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ఈనెల 8 నుంచి 21వ తేదీ వరకు 22 లక్షల మంది విద్యార్ధులు గాంధీ చిత్రాన్ని చూడడం భావితరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందన్నారు.
జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ఈ పుస్తక ప్రదర్శనలను 33 జిల్లాల వాకిళ్ల దాకా తీసుకపోతామని ప్రకటించారు. ఈ ముగింపు సభకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ అధ్యక్షత వహించగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గౌరవ సలహాదారులు ఎం.బి గోనారెడ్డి, నిర్వాహకులు యానాల ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు శృతికాంత్ భారతి, రచయిత మనోహరచారి తదితరులు పాల్గొన్నారు.