ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం.. ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ప్రత్యేక హరితహారం కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం సవివరమైన ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టేంది.
రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతానికి పచ్చదనం 7.6 శాతం పెరిగి ఇప్పటి వరకు ఆ విస్తీర్ణత 31.6 శాతానికి చేరింది. రానున్న రోజుల్లో ఆకు పచ్చదనం పెరిగి ఆకు పచ్చ తెలంగాణ రాష్ట్రంగా శోబిల్లనున్నది.
అడవులను రక్షించాలి... పచ్చదనం పెంచాలి... అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా “హరితహారం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 264 కోట్ల మొక్కలు నాటారు. ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో ఆ లక్ష్యానికి మరింత చేరువకావడానికి ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది.
అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులు, HMDA,GHMC అధికారులకు పలు సూచనలు, కార్యక్రమం వివరాలు, మొక్కల పంపిణీ తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలంతా పులకరించే విధంగా పల్లెలు, పట్టణాలు, సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
నర్సరీల్లో మొక్కల లభ్యత, మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగు కార్యచరణ ప్రణాళిలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. మున్సిపాలిటీల్లో ఎక్కువ మొక్కలు నాటేలా ప్రాధా న్యత నివ్వాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ సంరక్షణ, పునర్జీవ చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం, పర్యావరణం పరిడవిల్లుతుంది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్పలితాలు ఇస్తుండంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శరాష్ట్రంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల అధికారులు ఈ హరితహారం కార్యక్రమం వివరాలను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అటవీ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శి గా ఉన్నది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పచ్చదనం పెరిగి పర్యావరణం సమతుల్యం కావడానికి ఈ హరితహారం కార్యక్రమం ఎంతో దోహదపడనున్నది.