ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, ఆగస్టు 19: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్.బి స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పరిశీలించారు. ఈనెల 22 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేలమందికి పైగా పాల్గొంటారని వెల్లడించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీస్ కమీషనర్ చౌహాన్ , DCP, Traffic రంగనాధ్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, MD, TSICC నరసింహారెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
శిశువిహార్ లో పండ్లు, స్వీట్లు పంపిణి చేసిన సి.ఎస్ సోమేశ్ కుమార్
భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు ఉదయం అమీర్ పేట్ సమీపంలోని శిశు విహార్ లోని పిల్లలకు పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈనెల 8వ తేదీ నుండి 22 వ తేదీ వరకు నిర్వహిస్తున్న భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండ్లు, స్వీట్లు పంపిణి చేపడుతున్నామని వెల్లడించారు. అనాధ శరణాలయాలు, ఆసుపత్రులలో ఉండే వారికి పండ్లు, స్వీట్లు పంచడం ద్వారా వారిలో ఒక మానసిక స్ధైర్యాన్ని కలుగ చేయడంతోపాటు వారిలో స్వతంత్ర ప్రాత స్ఫూర్తిని కలిగించేందుకు దోహద పడుతుందని తెలిపారు. ఈ సందర్బంగా శిశు విహార్ లో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లి వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. శిశువిహార్ లో ఉంటున్న అవిభక్త కవలలు వీణా, వాణి లను కలసి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా దివ్యాంగులు, బాల బాలికలు ప్రదర్శించిన ఫాన్సీ డ్రెస్ పోటీలు, పాడిన పాటలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ ఇతర అధికారులు పాల్గొనున్నారు.