భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కరించకపోతే అమరావతిలో పోరాటమే: పవన్ కల్యాణ్
•జయాపజయాలు సమంగా తీసుకుంటా... గాజువాక పరాజయం పెద్దగా ప్రభావం చూపలేదు
•గాజువాక ప్రజల సమస్యలపై క్రమపద్దతిలో పోరాటం చేస్తాం
•లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన నేతలపై కేసులుపెట్టారు
•వైసీపీవాళ్ళు మనుషుల్ని చంపేసినా కేసులుండవు
•కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసులు ఏమయ్యాయి?
•జగన్ సీఎం అయినా తేలలేదంటే... ఏదో మతలబు ఉంది
•ప్రజల పన్నులతో చేపట్టే సంక్షేమ పథకాలకు మీ పేర్లు, మీ తండ్రి పేర్లా?
•భారతి సిమెంట్, సాక్షి సొమ్ములతో పథకాలు పెట్టి పేర్లు పెట్టుకోండి
•గాజువాక జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్
ప్రజలు కట్టే పన్నులతో చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఈ నేల కోసం ప్రాణ త్యాగం చేసినా పొట్టి శ్రీరాములు వంటి గొప్ప నాయకుల పేర్లు పెట్టకుండా మీ పేర్లు, మీ తండ్రి గారి పేర్లు పెట్టుకోవడం ఏమిటని ముఖ్యమంత్రిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు అని వైసీపీ నాయకులు అనుకోవచ్చు... అలా అనీ ప్రతి పథకానికీ ఆయన పేరే పెట్టాలా..? అని నిలదీశారు. మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి పేరు మీద ఇచ్చే ప్రతిభ పురస్కారాలను కూడా మీ తండ్రిగారి పేరు మీదకు మార్చడం సబబు కాదని అన్నారు. భారతీ సిమెంట్స్, సాక్షి నుంచి నిధులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేపట్టినప్పుడు మీ పేర్లు, మీ తండ్రిగారి పేర్లు పెట్టుకోండి తప్ప.. ప్రజల డబ్బులతో చేపట్టే పథకాలకు మహానీయుల పేర్లు పెట్టండి అని సూచించారు. ప్రభుత్వ పథకాలకు గొప్ప వ్యక్తుల పేర్లు ఎందుకు పెడతాం అంటే.. మీరు చేసిన సేవలు మర్చిపోలేదు, మీ స్పూర్తిని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పడానికని గుర్తు చేశారు. మంగళవారం సాయంత్రం గాజువాక నాయకులు, జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఇప్పుడున్న పరిస్ధితుల్లో రాజకీయ పార్టీలను నడపడం చాలా కష్టంతో కూడుకున్న పని. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజకీయం అంటే డబ్బు సంపాదించడమే తప్ప సేవ చేయడం కాదని నిరూపితమైన సమయంలో.. సమాజం మీద ప్రేమ, దేశం మీద మమకారంతో జనసేన పార్టీ పెట్టాను. దెబ్బలు తినొచ్చు. ఓడిపోతే అవమానం పొందుతాం అని తెలిసి అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. విజయం, అపజయాన్ని సమానంగా తీసుకుంటాను కనుకే గాజువాకలో పరాజయం నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. భవన నిర్మాణ కార్మికులు నాకు ఓట్లు వేశారో వేయలేదో పట్టించుకోలేదు. వాళ్ల సమస్యను ఎందుకు పట్టించుకోవాలి అనుకోలేదు. ఓట్లు వేసినా వేయకపోయినా జనం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. అదే మన స్థానంలో వైసీపీ ఉంటే మాత్రం ఓట్లు వేయలేదు కదా మీకోసం ఎందుకు పోరాడాలి అని అడిగేది.
•అధికారం ఏమైనా కవచకుండలమా?
లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినా వైసీపీ నాయకులకు ఎందుకు నోరు లేస్తోంది అంటే.. డబ్బులిచ్చి ప్రజలను నైతికంగా చంపేశారు. డబ్బులు తీసుకోవడంతో పోరాడే నైతిక హక్కు కోల్పోయాం. నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి చెవుల నుంచి రక్తం వచ్చేలా మాట్లాడగలను, కానీ భవన నిర్మాణ కార్మికుల సమస్య పక్కదారి పడుతుందని మాట్లాడటం లేదు. నన్ను బూతులు తిడితే జనసైనికులు రెచ్చిపోయి సమస్య పక్కదారి పడుతుందని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదు. వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అందరిలాగే సర్వసామాన్యులు. అధికారం రాగానే కవచకుండలాలు వచ్చినట్లు ప్రవర్తించకండి. సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుడే శాపాల కారణంగా వాటిని పోగొట్టుకున్నాడు. అధికారం అనే కవచకుండలాలు పెట్టుకొని మా మీదకు ఎక్కాలని చూస్తే వాటిని కొట్టే అర్జునుడు ఉంటాడని మరిచిపోకండి. 30 రోజుల్లో అదుపు తప్పి మాట్లాడటం ఎలా..? అడ్డు అదుపు లేకుండా మాట్లాడటం ఎలా..? అనే పుస్తకాల్ని అంబటి రాంబాబు కొని చదివినట్లు ఉన్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. విజ్ఞత మరవకండి.
•పదవులన్నీ ఒకే కులంతో నింపితే సమతుల్యత దెబ్బ తింటుంది
ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీ వెనుక ఉండి, కులాల వారిగా జనం విడిపోతే సమాజం విచ్ఛిన్నం అవుతుంది. గాజువాకలో ఓడిపోవడం చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా వెనుక కులం లేదని తేలింది. నాకు పడిన 55 వేల ఓట్లు అన్ని కులాల నుంచి వేశారు. జనసేన పార్టీ ఎప్పటికీ ఒక కులం మీద ఆధారపడి రాజకీయం చేయదు. మేమే కాదు ఏ పార్టీ కూడా కులం మీద ఆధారపడి రాజకీయం చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. ఒక వ్యక్తి అధికారంలోకి వస్తే ఒకే కులంతో పదవులు నింపడం చాలా తప్పు. సమాజంలో సమతుల్యత దెబ్బతింటుంది. ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది. ముఖ్యమంత్రి మన మతమైతే ఒకలాగా. మన మతం కాకపోతే వేరేలా చూస్తే ఎలా..?.
భారతదేశాన్ని ఒకతాటిపై నిలబెట్టేది భారత రాజ్యాంగం. అనేక మతాల సారాంశం అది. కర్ణాటక రాష్ట్రంలో నా కులం లేదు. అక్కడికి వెళ్లే వరకు మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన నా దగ్గరకు వచ్చి మీ ఏడు సిద్దాంతాలు నచ్చాయి. భారతదేశానికి ఇలాంటి సిద్ధాంతాలే కావాలని మెచ్చుకున్నారు. ఒక వ్యక్తిది మన కులామా..? మతమా..? అని చూడకండి. ప్రజా సమస్యలు తీర్చగలడా లేదా అనేది మాత్రమే ఆలోచించండి.
•బ్రిటిషు వాళ్లకే దిక్కులేదు వైసీపీ ఎంత..? వాళ్ల బతుకెంతా..?
సూర్యుడు అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్నే తరిమేసిన చరిత్ర మనది. అలాంటిది వైసీపీ పార్టీ ఎంత..?. వాళ్ళ బతుకెంతా..?. వైసీపీ మద్దతుదారులకు నా మాటలు బాధ కలిగించవచ్చు. ముందు మీరు మారండి. ఒక కిరాతకుడు వాల్మీకి అయి రామాయణం రాశాడు. అనేక ఆర్థిక నేరాల్లో అభియోగాలు ఉన్న మీ నాయకుడు గొప్ప నాయకుడిగా మారితే సంతోషమే. అంతే కానీ ఫ్యాక్షనిజం పేరుతో జనాలను భయపెట్టి, చట్టాలు, అధికార యంత్రాంగాన్ని చేతులోకి తీసుకొని ఏలుతానంటే చూస్తూ ఊరుకోం. రాముడు పాలించిన నేల, కృష్ణుడు నడయాడిన నేల, ధర్మాన్ని నిలబెట్టిన నేలని గుర్తించుకోండి.
వైసీపీ నాయకులకు జనసేన పార్టీ అంటే భయం. ఇప్పుడు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చాయని ఎవరిముందైనా తలెగరేయండి. కానీ నా ముందు కాదు. మీలాగా అధికారం చేజిక్కించుకునే పిచ్చిలో తప్పులు చేయను. అధికారం అలంకారం అయిన రోజున తీసుకుంటాను కానీ అధికారం కోసం అర్రులు చాచను. నాకే గనుక వ్యక్తిగత అధికార కాంక్ష ఉంటే ఓటమి తర్వాత వచ్చి ఇలా నిలబడేవాడిని కాదు. ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ వ్యూహం పన్ని పదవి చేజిక్కించుకునేవాడిని. ప్రత్యేక హోదాపై మాట తప్పారని బీజేపీ పార్టీ, ప్రధాని మోడీతో విభేదించాను. అంతేగానీ వైసీపీలాగా దొంగ గొడవులు పెట్టుకోలేదు. ఒక ఆశయానికి కట్టుబడి ఓడిపోయాను కనుకే ఇవాళ ఇంతమంది జనం నా వెనుక నిలబడ్డారు. అదే మాట తప్పి గెలిచినా ఇంతమంది వచ్చేవారు కాదు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడికి లక్షన్నర జనం అండగా ఉన్నామని లాంగ్ మార్చ్ సాక్షిగా చెప్పారు. విలువులు ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది.
•వీళ్లు మనుషులను చంపేసినా కేసులు ఉండవు
లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహిస్తే మా నాయకులు మీద కేసులు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించామని, అనుమతి లేని చోట సభ నిర్వహించామని ఇలా కేసులు నమోదు చేశారు. వైసీపీ నాయకులు మనుషులు చంపేసినా కేసులు ఉండవు. జగన్ గారిపై దాడి జరిగిన కోడి కత్తి కేసు ఏమైంది..? వైఎస్ వివేకానందరెడ్డి గారిని అతికిరాతంగా చంపేశారు. ఆ కేసు ఏమైంది..?. జగన్ ముఖ్యమంత్రి అయిన తరవాతా ఈ కేసుల్లో పురోగతి లేదంటే అందులో ఏదో మతలబు ఉందని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులను మీరు మరిచిపోయినా మేము మరిచిపోము. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మా పార్టీ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాబోయే రోజుల్లో చుక్కలు చూపించడం ఖాయం.
భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారానికి రెండు వారాల గడుపు ఇచ్చాం. గడుపులోగా ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకపోతే అమరావతిలో వేడి పుట్టిస్తాం. గాజువాక నియోజకవర్గంలో చాలా సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. గంగవరం పోర్టు, అగనంపూడి టోల్ గేట్ సమస్య, స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలపై క్రమ పద్ధతిలో పోరాటం చేస్తాం. ముఖ్యంగా సంక్రాంతి తరవాత అగనంపూడి టోల్ గేట్ సమస్యపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఈ రెండు నెలల్లో స్పందించకపోతే నేనే టోల్ గేట్ తెరిచి వాహనాలను పంపించే బాధ్యత తీసుకుంటాన”ని హామీ ఇచ్చారు.
•బాధ్యత లేని ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
ప్రధానమైన ప్రజా సమస్యపై కార్యక్రమం చేపట్టాలని తలచి విశాఖలో లాంగ్ మార్చ్ కు నిర్ణయిస్తే దాన్ని అడ్డుకోవడానికి రాజకీయంగా, అధికారికంగా రకరకాల ప్రయత్నాలు చేశారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. “అది చాలదన్నట్లు నిన్న, మొన్న మంత్రులు, ఎం.ఎల్.ఎ.లు ఏ విధంగా మాట్లాడారో మీరందరూ గమనించే ఉంటారు. ఇదేనా సంస్కృతి, దీని కోసమేనా మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరు తిరిగి ఓదార్పు యాత్రలు చేశారు. ప్రజల తరఫున పోరాడుతున్నట్లు చెప్పారు. ఈ రోజు ఉన్నత స్థానంలో ఉండి ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు. కేవలం మా పైన బురద చల్లడం తప్ప మీరు రాష్ట్ర శ్రేయస్సు కోసం, చనిపోయిన కార్మికుల కోసం ఎందుకు చర్యలు తీసుకోరు. ఇసుక కొరతతో భవన నిర్మాణం ఎలా కుంటుపడిందో ఎందుకు పట్టించుకోరు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందనే అనుమానం కలుగుతోంది. ఇది బాధ్యత లేని ప్రభుత్వం, కమిట్ మెంట్ లేని ప్రభుత్వం, కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం. ఆరు నెలలు తిరగకుండానే ఎందుకు ఓటేశామనే భావన ప్రజల్లో కలుగుతోంది. గాజువాకలో పవన్ కల్యాణ్ గారిని గెలిపించుకోలేకపోయామని చాలా మంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే” అని మనోహర్ పేర్కొన్నారు.
* స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: వి.వి.లక్ష్మీనారాయణ
‘చాలా మంది అన్నారు జనసేన ఓడిపోయిందని... కాని నేనంటున్నాను జనసేన గెలిచిందని. ఎందుకంటే డబ్బులు, మద్యం పంచుతున్న ఈ రాజ్యంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో మనం ముందుకు వచ్చాం. వేలాది మందిలో మార్పు తీసుకురాగలిగాం. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచింది జనసేన పార్టీయే’ అని పార్టీ ముఖ్య నాయకులు వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. “ఈ మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో ఇది స్పష్టమవుతుంది. మొన్న జరిగిన లాంగ్ మార్చ్ చూసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి విశాఖ లో సముద్ర గతి ఏమైనా మారిందా అనే అనుమానం వచ్చిందట. ఉప్పెనలా కదలి వచ్చి అంతటి ప్రేమ, ఆదరణ చూపిన విశాఖవాసులకు, ముఖ్యంగా గాజువాక వారికి మనస్పూర్తిగా అభినందనలు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కు సపోర్టు చేసింది రాష్ట్రంలో ఒక్క గాజువాక నియోజకవర్గం మాత్రమే. బ్రిటిష్ వాళ్లు సముద్రంలో ఉప్పును ముట్టి దేశం వదలి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఇసుకను ముడుతున్నారు.... ఏమవుతుందో చూడండి అని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జి.వి.ఎం.సి. మీద జనసేన జెండా ఎగరాలి. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించి పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించాలి. స్టీలు ప్లాంటు, గంగవరం పోర్టు సమస్యలను అందరం కలిసి అధిగమిద్దాం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కోన తాతారావు, టి.శివశంకర్, సత్య బొలిశెట్టి, గడసల అప్పారావు, పరుచూరి భాస్కరరావు, సుందరపు విజయకుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.