గ్రామీణ ప్రాంత మధుమేహ రోగుల్లో 80% మందికి కాళ్లు, వేళ్ల తొలగింపు
* హైదరాబాద్ లాంటి నగరాల్లో 20% మందికే ఆ అవసరం
* మధుమేహుల కాళ్లను కాపాడే వాస్క్యులర్ సర్జరీ
* ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటు
* వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జరీలతో అధిక ప్రయోజనం
* కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ నరేంద్రనాథ్ మేడా
హైదరాబాద్, జూలై 31, 2022: మధుమేహ రోగులకు కాళ్ల సంరక్షణ చాలా ముఖ్యం. కాలిలో ఏ చిన్న గాయమైనా నరాలు మూసుకుపోయి.. గ్యాంగ్రిన్, ఇన్ఫెక్షన్లు పెరిగి, చివరకు వేళ్లు లేదా కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద నగరాలు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దాదాపు 80% మధుమేహ రోగులకు ఇలా వేళ్లు, కాళ్లు తొలగిస్తున్నారు. 20% మందికే వాటిని కాపాడగలుగుతున్నారు. అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే 80% మందికి కాపాడి, 20% మందికే తొలగించాల్సి వస్తోంది. వాస్క్యులర్ సర్జరీ విభాగంలో వచ్చిన అత్యాధునిక విధానాలే ఇందుకు కారణం. వాస్క్యులర్ సర్జన్లు దెబ్బతిన్న వేళ్లు, కాళ్లలోని నరాలకు శస్త్రచికిత్స చేసి, వాటిలో రక్తప్రసారాన్ని పునరుద్ధరించడం వల్ల కాళ్లను కాపాడగలుగుతున్నారు. కానీ, దేశంలో వాస్క్యులర్ సర్జన్ల సంఖ్య చాలా తక్కువ. మధుమేహ రోగులకు కాళ్లలో నరాలు మూసుకుపోయినప్పుడు.. వాటిని సరిచేసి, రక్తప్రసరణను పునరుద్ధరించి, కాళ్లను రక్షించడం వాస్క్యులర్ సర్జన్ల వల్లే అవుతుంది.
వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జరీలలో వచ్చిన అత్యాధునిక చికిత్సా పద్ధతులు, డయాబెటిక్ ఫుట్ విషయంలో అవగాహన కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. వాస్క్యులర్ ఫౌండేషన్ సహకారంతో కిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ ఈ సదస్సును నిర్వహించింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 150 మందికి పైగా వైద్యులు దీనికి హాజరయ్యారు. కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు సదస్సును ప్రారంభించగా, ఆస్పత్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్రనాథ్ మేడా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మధుమేహ రోగుల కాళ్లలో ఏవైనా పుళ్లు ఏర్పడినా, లేదా దెబ్బలు తగిలినా.. కాలిని తొలగించాల్సిన అవసరం లేకుండా కాపాడేందుకు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై జనరల్ ఫిజిషియన్లు, డయాబెటాలజిస్టులకు ఈ సదస్సులో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్రనాథ్ మేడా మాట్లాడుతూ "మధుమేహ రోగుల కాళ్లను తొలగించకుండా కాపాడాలంటే చికిత్సతో పాటు, రోగికి అవగాహన కల్పించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా ఏటా పాదాల పరీక్ష చేయించుకుని, రోజూ తమకు తాముగా పరీక్షించుకుంటే.. అల్సర్ రాకుండా నిరోధించవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా, మొదట్లోనే తెలుస్తుంది. మధుమేహ రోగులు చెప్పులు వేసుకోకుండా నడకూడదు. అవి కూడా సరిగ్గా సరిపోయేలా ఉండాలి. కాలికి పగుళ్లు రాకుండా, గాయాలు కాకుండా నిరోధించగలిగితే చాలా మంచిది. క్రమం తప్పకుండా నడిచి, తగిన వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ బాగుంటుంది. హైదరాబాద్ లాంటి నగరాలు కాకుండా ఇతర పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికీ నెలకు దాదాపు 180 మందికి వేళ్లు, కాళ్లు తొలగిస్తున్నారు. 20 మందికి మాత్రమే వాటిని కాపాడగలుగుతున్నారు. అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే 180 మందికీ కాపాడి, 20 మందికి మాత్రమే తొలగించాల్సి వస్తోంది" అని చెప్పారు.
"మధుమేహం ఉన్నవారిలో కాళ్లకు దెబ్బ తగిలినప్పుడు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల పుండు మానకపోవడం, క్రమంగా నరాలు పూడుకుపోవడం లాంటివి సంభవిస్తాయి. వేళ్లు పూర్తిగా పాడయ్యేవరకూ సొంత వైద్యం లేదా స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వ.