వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- స్వాతంత్ర్య సమర యోధులకు సత్కారం
- మూడు రోజుల పాటు సాంస్కృతిక కదంబం
- నోరూరించే తెలుగు రుచుల తియ్యదనం
- గాంధీజి ఛాయా చిత్రాలు, స్టాంపుల ప్రదర్శన
పింగళి వెంకయ్య, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, భోగరాజు పట్టాభి శీతారామయ్య, వావిలాల గోపాల కృష్ణయ్య , కన్నెగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరశింహారెడ్డి, కడప కోటిరెడ్డి, అచార్య ఎన్ జి రంగా, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, దుర్గాభాయి దేశ్ ముఖ్, సురవరం ప్రతాప రెడ్డి, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాధం తదితరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ నేపధ్యంలో వేడుకల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న పర్యటక, భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనుండగా, సభాకార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానుందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చేనేత, హస్త కళల ప్రదర్శన నిర్వహిస్తున్నామని, రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభవేళ నేత కళాకారులు రాయితీలకు కూడా అందించనున్నారని వివరించారు.
అదరహో అనిపించేలా తెలుగు సాంప్రదాయక ఆహార ఉత్సత్తుల ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నామని, డ్వాక్రా సంఘల మొదలు స్టార్ హోటళ్ల వరకు వివిధ స్ధాయిలలో తెలుగు రుచులు సిద్దం కానున్నాయని ప్రవీణ్ కుమార్ వివరించారు. గాంధీజీ 150 జయంతి వేడుకలను సైతం గుర్తు చేసుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాలు, ఛాయా చిత్రాలు, స్టాంపుల ప్రదర్శన ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు , ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారన్నారని మూడు రోజల పాటు ప్రాంగణంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకతను సంరించుకోనున్నాయని వివరించారు. నవంబరు మూడవ తేదీ వరకు ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్యాలు, సురభి నాటకములు, లలిత సంగీతం, జానపద కళారూపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక అలరించనుందని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వివరించారు.