శత వసంతాలు పూర్తిచేసుకున్న పింగళి వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మి నిర్యాణం
డాలస్, టెక్సాస్ - భారతదేశ జాతి గౌరవంఅయిన మన జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి ఘంటసాల సీతామహాలక్ష్మి గారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో ఆమె కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
డా. మండలి బుద్ధప్రసాద్, డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ – “ఈ సంవత్సరం మే 10 వ తేదిన మాచర్లలో నివాసముంటున్నశత వసంతాలు పూర్తి చేసుకున్న సీతామహాలక్ష్మిగారి ఇంటికివెళ్లి, ముందుగా పింగళి వెంకయ్యగారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆ తర్వాత సీతామహాలక్ష్మి గార్ని ఘనంగా సన్మానించి ఆమెకు పాదనమస్కారం చేసుకునే అవకాశం గల్గడం తమ అదృష్టం అన్నారు”.
“100 సంవత్సరాల వయస్సులో కూడా ఏ మాత్రం చెరగని ఉత్సాహం, తరగని జ్ఞాపకశక్తితో అనేక విషయాలను ఆసక్తిగా పంచుకోవడం, వెంకయ్యగారి మనవడు జి.వి.ఎన్ నరసింహం ఆంగ్లం మరియు తెలుగు భాషల్లో రాసిన ‘పింగళి వెకయ్య జీవితచరిత్ర’ పుస్తకాలను ఆ వయస్సులో కూడా ఆమె తన స్వహస్తాలతో సందేశం రాసి మరీ సంతకంచేసి తమకు బహుమతులుగా ఇవ్వడం ఒక మధురానుభూతి అన్నారు”.
పింగళి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సీతామహాలక్ష్మి గారి ఆత్మకు భగవంతుడు సద్గతిని కల్గించాలని మండలి బుద్ధప్రసాద్, తోటకూర ప్రసాద్ లు కోరుకున్నారు.