డాక్టరేట్ సాధించిన మార్గంకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు!
హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన ప్రజా సంబంధాల అధికారి మార్గం లక్ష్మీనారాయణను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం గిరిజన విజ్ఞాన అధ్యయన శాఖ ఆధ్వర్యంలో, వరంగల్ లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో మారుతున్న *గిరిజనుల సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు - ఐ.టి.డి.ఎ. ప్రభావం, గోవిందరావుపేట మండలం* అనే అంశంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేయగా, మార్గం లక్ష్మీనారాయణకు యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది.
రవీంద్రభారతిలో బుధవారం జరిగే స్నాతకోత్సవంలో ఈ అవార్డును అందచేయనున్నారు. ఈ సందర్భంగా తన వద్ద పి.ఆర్.ఓ.గా పని చేస్తున్న మార్గంను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. శాలువాతో సత్కరించారు. తన వద్ద పని చేస్తూనే, గిరిజన సామాజిక, సాంస్కృతిక స్థితిగతులపై, వారి అభివృద్ధిలో ఐ.టి.డి.ఎ. పాత్రను కూలంకశంగా తులనాత్మక పరిశోధనాత్మక అధ్యయనం చేసి, అవార్డును పొందడం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. మార్గం మరిన్ని ఉన్నత చదువులు, అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు.