తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బోనాల పండుగ విశిష్టత మరింత పెరిగింది: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బోనాల పండుగ విశిష్టత మరింత పెరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ నెల 17 వ తేదీన మహంకాళి అమ్మవారి బోనాల జాతర, 18 వ తేదీన నిర్వహించిన రంగం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చారని తెలిపారు. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
పోలీసు, దేవాదాయ శాఖ, వాటర్ వర్క్స్, GHMC, హెల్త్, ఎలెక్ట్రికల్ ప్రతి ఒక్క శాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, పండితులు, అర్చకులు ప్రతి ఒక్కరి కృషితో నే ప్రశాంతంగా, గొప్పగా అమ్మవారి జాతర జరిగిందని, అందరికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా భక్తులకు సేవలు అందించిన దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, స్కౌట్ అండ్ గైడ్ సంస్థల సభ్యులకు, ఇతర వాలంటీర్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. బోనాల ఉత్సవాలు, ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపు వంటి కార్యక్రమాలు ప్రశాంత వాతావరణం లో జరగడానికి పోలీసు శాఖలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.
గతంలో భక్తులు దర్శనం కోసం చాలా సేపు నిల్చొనే వారని, ఈ సంవత్సరం బోనాలను తీసుకొనివచ్చే వారికి, మహిళలకు అదనపు క్యూ లైన్ లను ఏర్పాటు చేయడం వలన స్వల్ప సమయంలో నే దర్శనం చేసుకున్నారని వివరించారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. బోనాల జాతరలో సేవలు అందించిన వారిని ఈ నెల 31 వ తేదీన సన్మానించనున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి వెంట ఆలయ EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.