ఎడ్యుకేషనల్ హబ్ గా గజ్వేల్
- 20 ఎకరాల్లో బాలికలకు,40 ఎకరాల్లో బాలురకు వసతులు
- ఈ హబ్ కు రూ.146 కోట్లు 28 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం
కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్నిరకాల విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్‌లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది.
గజ్వేల్‌లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యాహబ్‌ను నిర్మించారు. దానికి ఒక కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యాహబ్‌ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో, ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటివేళల్లో సహజసిద్ద వెలుగు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబులు రూపొందించారు.
ఉత్తమ బోధనతోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాట్లు చేశారు. 1,200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్‌లో 2,500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1,000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్‌లో చదుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచస్థాయికి ఎదిగేలా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్‌ను కొనసాగిస్తున్నారు. గజ్వేల్ స్ఫూర్తితో మరికొన్ని జిల్లాల్లో విద్యాహబ్‌ల నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.