'మానవ అక్రమ రవాణా' పై అవగాహన సదస్సులో పాల్గొన్న సునీత లక్ష్మారెడ్డి

Related image

హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ మరియు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన 'మానవ అక్రమ రవాణా' పై అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండడం చాలా బాధాకరమని అన్నారు. బాలికలతో ప్రేమ నటించడం, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలకడం, పేదరికం, కుటుంబ అవసరాలను తీరుస్తామని ఆకర్షించడం, నిరుద్యోగం, భర్త నుంచి విడిపోయిన మహిళలను లొంగ తీసుకోవడం, ఒంటరిగా జీవిస్తున్న మహిళలు నిరక్షరాస్యత, సినిమాల్లో ఛాన్స్‌, విలాస వంతమైన జీవితాల వైపు ఎరవేయడం తదితర కారణాలు మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రపంచంలో డ్రగ్స్, ఆయుధాల సరఫరా తరువాత మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తుందన్నారు. ''స్వలాభం కోసం కొందరు మనుషులను కొనడం, అమ్మడం చేస్తున్నారని, అక్రమ రవాణాకు గురైన వారిని ఎక్కువగా సెక్స్ వర్కర్లుగా, అడాప్షన్ రాకెట్లలో,కూలీలుగా, బాలకార్మికులుగా, బెగ్గింగ్ (బిచ్చగాళ్ళు) గా మారుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు పౌర సంఘాలు, స్వచ్చంద సేవా సంస్థలు ముందుకు రావాలని అన్నారు.

మానవ అక్రమ రవాణా అరికట్టడంలో బ్రాండ్ అబసిడర్లుగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు 100, మహిళా హెల్ప్‌లైన్‌ 181, మహిళా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533, 1098 చైల్డ్‌లైన్‌కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్ పర్సన్స్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణకుమారి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్చంద సేవ సంస్థలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases