కాలుష్య నియంత్రణకై నగరంలో సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు: వీఎంసీ కమిషనర్
విజయవాడ: నగరపాలక సంస్థ పరిధిలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయు అంశముపై నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఛాంబర్ నందు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో ప్రధానంగా నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించుటకు తగిన ప్రణాళికలతో నగరపాలక సంస్థ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలీస్ శాఖా వారి సహకారంతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయుటకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయుట మరియు సదరు ట్రాక్ చేపట్టవలసిన చర్యలపై తగిన నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.
సదరు సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ ) శ్రీ సర్కార్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఉదయ కుమార్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, అర్బన్ ప్లానర్ మొజ్ అలీ మరియు సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.