పాయకాపురం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్
ఆయుర్వేద ఔషద మొక్కలు నాటాలి
విజయవాడ: సింగ్ నగర్ ప్రాంతములో గల పాయకాపురం చెరువు నందలి పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలసి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనుల వివరాలు మరియు వాటి పురోగతిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేస్తూ, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదం అందించుట, ఆకర్షణీయమైన మొక్కలను ఏర్పాటుచేయుటతో పాటుగా బ్లాక్స్ నందు ఔషద గుణాలు కలిగిన ఆయుర్వేద మొక్కలను నాటి సుందరంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన శాఖాధికారులకు సూచించారు. అదే విధంగా చెరువులోపల అక్కడక్కడ తూటి ఆకులు, చిన్న చిన్న పొదలుగా ఉండుట గమనించి వాటిని తొలగించి చెరువును శుభ్రపరచాలని సూచించారు. పార్క్ నందు చేపట్టిన అభివృద్ధి పనులు అన్నియు త్వరితగతిన పూర్తిచేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని మరియు సెక్యూరిటి గార్డ్ ను ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, ఉద్యానవన అధికారి శ్రీనివాసు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.