సీఎస్ సోమేశ్ కుమార్ తో సమావేశమైన ఉత్తర ప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ అధికారులు
హైదరాబాద్, జూన్,04: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్నిపెంచేందుకు కమర్షియల్ టాక్స్ శాఖ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ బృందానికి ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివరించారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు యొక్క మార్గదర్శకత్వంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం 2014లో సుమారు రూ. 23 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరం ఇది దాదాపు మూడు రేట్లకు పెరిగి రూ. 65 వేల కోట్లకు చేరుకొందని ఆయన వివరించారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.
వ్యవస్తీకృత మార్పుల ద్వారా శాఖ పనితీరులో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని తెలియజేశారు. మాన్యువల్ ఆధారిత నోటీసులు, ప్రొసీడింగ్‌ల జారీలను పూర్తిగా తొలగించామని చెప్పారు. ప్రతీ స్థాయిలో భౌతిక లక్ష్యాల స్థానంలో నిర్దారిత ఆధారిత లక్ష్యాలను ఏర్పాటుచేశామని తెలిపారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు తదితర చర్యల ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించామని, కొత్తగా శాఖ పరంగా పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అమలవుతున్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడం తమకు అవకాశం లభించిందని ఉత్తరప్రదేశ్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ ఎస్. మినిస్టి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన అదనపు కమీషనర్లు సాయి కిషోర్, కాశి, శోభన్ బాబు లతోపాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన కమర్షియల్ టాక్స్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.