మన బస్తీ - మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన మన బస్తీ _ మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ వాకాటి కరుణ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణిదేవి, జాఫ్రీ, జనార్ధన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, మౌజం ఖాన్, కలెక్టర్ శర్మన్, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ షఫీ, జీహెచ్ఎంసీ,టీఎస్ఎంఐడీసీ తదితర ఇంజనీరింగ్ విభాగాల, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వారం రోజులలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్ మెంట్ (ఎస్ఎంసీ) కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం, ప్రహారీగోడ నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాబోధన జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన వివరించారు. ఇందుకోసం చేపట్టిన మన బస్తీ _ మన బడి కార్యక్రమం పనుల పర్యవేక్షణ లో ఎస్ఎంసీ లను భాగస్వాములను చేయడం ద్వారా పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
అదే విధంగా పనులు చేపట్టడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఎమ్మెల్యే లేదా, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ డీఈఓలతో వారి పరిదిలలో పాఠశాల్లో జరుగుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. నాది అనే భావనతో ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. అధికారులు కార్యాలయలకే పరిమితం కాకుండా పనులు త్వరితగతిన చేపట్టి పూర్తిచేసేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.
మన బస్తీ _ మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ల కొరకు తీవ్రపోటీ నెలకొనే పరిస్థితులు రానున్న రోజులలో ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. సుల్తాన్ బజార్ లో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పూర్తిస్థాయిలో నిర్మించేందుకు ఒక స్వచ్చంద సంస్థ సిద్దంగా ఉందని, ప్రభుత్వ పరంగా అనుమతులు కావాల్సి ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొనగా, బుధవారం మధ్యాహ్నం ఆ పాఠశాలను అధికారులతో కలిసి సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.
చిన్న ప్యాక్ లలో అందుబాటులోకి విజయ డెయిరీ ఉత్పత్తులు: మంత్రి తలసాని
వినియోగదారుల కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయ డెయిరీ ఆధ్వర్యంలో నూతనంగా ఉత్పత్తిని చేసిన 10, 20 రూపాయలు, 50ఎంఎల్ గల స్పెషల్ గ్రేడ్ అగ్ మార్క్ నెయ్యి ప్యాకెట్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హాతో కలిసి మార్కెట్ లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల లో విజయ డెయిరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అనేక నూతన ఉత్పత్తులను మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అన్ని రకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పెద్ద ఎత్తున ఔట్ లెట్ ల ఏర్పాటు, ట్రై సైకిల్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజులలో నూతన ఉత్పత్తులు అనేకం మార్కెట్ లోకి తీసుకొచ్చి నూతన ఔట్ లెట్ లను మరిన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ మార్కెటింగ్ జీఎం మల్లిఖార్జున్, అధికారులు మల్లయ్య, కామేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అధర్ సిన్హాను సన్మానించిన మంత్రి:
ఈరోజు పదవీ విరమణ చేస్తున్న పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.