ఘనంగా రాయలసీమ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

Related image

  • 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యావిధానం
  • రాయలసీమ విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవంలో వెబినార్ ద్వారా పాల్గొన్న గవర్నర్
విజయవాడ, మే 21: దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, జాతీయ విద్యా విధానంతో నాటి విద్యావ్యవస్థ సంస్కరణ బాట పట్టటం ఈ తరం విద్యార్థుల అదృష్టమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. స్నాతకోత్సవ ప్రసంగాన్ని అందించిన గవర్నర్ హరిచందన్, యాక్సెస్, ఈక్విటీ, నాణ్యత, స్థోమత, జవాబుదారీతనం అనే స్తంభాలపై నిర్మించిన జాతీయ విద్యా విధానం భారతదేశాన్ని శక్తివంతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దుతుందన్నారు.

భారత్ ను జ్ఞానసంపద పరంగా సూపర్ పవర్‌గా మార్చటమే దీని లక్ష్యమన్నారు. జాతీయ విద్యా విధానం 2020 ఎంతో సమగ్రమైనదన్న గవర్నర్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అది తీర్చిదిద్దబడిందన్నారు. స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన విద్యార్థులు, బంగారు పతకాలు అందుకున్న విద్యార్థులు, డాక్టరేట్ పొందిన రీసెర్చ్ స్కాలర్‌లను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు.

నాటక, నవలా రచయిత, దర్శకుడు, నటుడు పాటిబండ్ల ఆనందరావు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డిలకు గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి అచార్య ఆనందరావు వార్షిక నివేదికను సమర్పించారు. విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వై.రఘునాథ రెడ్డి, డాక్టర్ వి.రవిశంకర్ గవర్నర్ ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases