పచ్చదనం పెంపు కార్యక్రమాలను నిరంతర ప్రక్రియలా కొనసాగించాలి: తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుకు అటవీ, మున్సిపల్ శాఖల మధ్య మరింత సమన్వయం
- అటవీ శాఖ నేతృత్వంలో పెద్ద మొక్కలు పెంచి మున్సిపాలిటీలకు సరఫరా చేసేలా చర్యలు
- హరిత వనాల్లో పచ్చదనం పెంపుపై సమీక్షించిన అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి
మున్సిపాలిటీలకు అవసరమైన పెద్ద మొక్కలను సరఫరా చేసేందుకు అటవీ శాఖ సంసిద్దత తెలిపింది. మొదటి దశలో 33 నర్సరీల్లో పెద్ద మొక్కల పెంపకం జరగనుంది. క్రమంగా ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిపివేయాలని, ప్రభుత్వ నర్సరీల్లోనే అవసరమైన అన్ని రకాల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా కొన్నేళ్లుగా నాటిన మొక్కలు, ఇప్పుడు చెట్లుగా మారి చక్కటి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని అన్నారు. ట్రీ సిటీగా వరుసగా రెండో ఏడాది కూడా హైదరాబాద్ అంతర్జాతీయ గుర్తింపు పొందటంలో అందరి కృషి ఉందని అధికారులు, సిబ్బందిని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రశంసించారు.
పట్టణ ప్రాంతాలకు చేరువలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాల హరిత వనాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపు లక్ష్యంగా పని చేయాలని కోరారు. హెచ్ఎండీఏ 16 హరిత వనాలను, జీహెచ్ఎంసీ 3, సీడీఎంఏ 5, ఫారెస్ట్ కార్పోరేషన్ 6 హరిత వనాలను అభివృద్ది చేస్తున్నాయి. మొత్తం ముఫ్పై వనాల్లో 55,88,300 మొక్కలను నాటాలనే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 32,78,500 పూర్తి చేశారు. మిగతా 23,09,800 మొక్కల లక్ష్యాన్ని దశల వారీగా రానున్న అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.
సమావేశంలో పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, కమిషనర్ సీడీఎంఏ డాక్టర్ ఎన్. సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఎం. ప్రశాంతి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు బీ. ప్రభాకర్, వీ. కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.