దేశానికి మన స్త్రీనిధి ఆదర్శం: మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

  • మ‌హిళ‌ల స‌మ‌ర్ధ‌త‌కు ప్ర‌తి రూపం
  • 10 ఏండ్ల కిందే కొత్త నైపుణ్యాల‌ను మొద‌లు పెట్టిన ఏకైక సంస్థ స్త్రీనిధి
  • దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి.
  • దేశంలో అతి త‌క్కువ వ‌డ్డీకే రుణాలు, వ‌డ్డీలేని రుణాలు ఇస్తున్న ఏకైక సంస్థ స్త్రీనిధి
  • బ్యాంకుల కంటే కూడా అధిక రుణాలు ఇస్తున్న సంస్థ స్త్రీనిధి
  • స్త్రీనిధి 9వ సర్వసభ్య సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి, ముఖ్య అతిథిగా ప్రసంగించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
(హైద‌రాబాద్‌), మార్చి 30: స్త్రీనిధి 9వ సర్వసభ్య సమావేశాన్ని హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ని ఆడిటోరియం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెప్మా ఎండీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల క‌మిష‌న‌ర్‌ సత్యనారాయణ, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, అధ్యక్షురాలు జి. ఇందిర, ఉపాధ్యక్షురాలు పి. రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, 19 మంది స్త్రినిధి డైరెక్టర్లు, 600 మంది మండల, పట్టణ సమాఖ్యల అధ్యక్షులు, వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్త్రీ నిధి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 50 కోట్ల చెక్కును అందజేశారు. మండల, పట్టణ సమఖ్యాలకు 47 కోట్ల చెక్కును అందజేశారు. స్త్రీ నిధి వార్షిక నివేదికను మంత్రి ఆవిష్కరించారు. చెల్లింపు పద్ధతిని మరింత సులభం, వేగవంతం చేయడానికి వీలుగా ఆన్ లైన్ పద్ధతిని మంత్రి ప్రారంభించారు. స్త్రీనిధి డిజిటల్ పద్ధతిని మంత్రి వీక్షించారు. ఈ సేవలను మంత్రి పరిశీలించి, దేశంలోనే తొలిసారిగా స్త్రీ నిధి సంస్థ వినియోగిస్తున్న ఈ సైన్ సేవలను ప్రారంభించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సహకారంతో ఇంత గొప్పగా, స్త్రీనిధిని తీర్చిదిద్దిన రాష్ట్ర మహిళా సభ్యులందరికీ, స్త్రీనిధి, సెర్ప్, మెప్మా అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు! పేదరిక నిర్మూలనలో భాగంగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, స్త్రీనిధిని సమర్ధవంతంగా, డ్వాక్రా సంఘాల‌కు చేర్చి, వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది దాకా.. సెర్ప్, మెప్మా, డీఆర్డీఓలకు 9వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌ సందర్బంగా శుభాకాంక్షలు! తెలిపారు.

32 కోట్లతో ప్రారంభమై, 10 ఏళ్లలో 5,300 కోట్లకు సంస్థను చేర్చిన మా అక్కా చెల్లెళ్ళు అందరినీ అభినందిస్తున్నాను. స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు 3 ల‌క్షల 97 వేల‌ మహిళ సంఘాలలోని 26 ల‌క్షల 92 వేల మంది సభ్యులకు14 వేల 339 కోట్ల రూపాయ‌ల‌ను ఋణాలుగా ఇచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3 వేల‌ కోట్ల రూపాయ‌ల‌ను రుణాలుగా ఇచ్చాం. ఇంతగా రుణాలను బ్యాంకులు కూడా ఇవ్వలేక పోతున్నాయి. అంత ఘనత సాధించిన స్త్రీ నిధి సంస్థను అభినందిస్తున్నానని మంత్రి అన్నారు.

తెలంగాణ రాక ముందు అంటే 2014 మార్చి వ‌ర‌కు కేవ‌లం 742 కోట్లు మాత్రమే ఇస్తే, తెలంగాణ వ‌చ్చాక 14 వేల 339 కోట్లు ఇచ్చాం. అంటే గ‌తంతో పోలిస్తే, 13 వేల 596 కోట్లు అద‌నం. ఇదంతా ప్రభుత్వ సహకారం తోనే సాధ్యమైంది. సీఎం కెసిఆర్ చేసిన కృషి ఎంతో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

40 ఏండ్ల కింద నేను రాజకీయాల్లోకి వచ్చిన. అప్పుడు మహిళలు బయటకు కూడా వచ్చేవారు కాదు.  బాల వికాస సంస్థ మొదట మహిళలను సంఘటితం చేసింది. నేను అప్పట్లో సీఎం ఎన్టీఆర్ గారికి ఆ విషయం చెప్పాను. అప్పుడు ఎన్టీఆర్ హయంలోనే డ్వాక్రా సంఘాలు మొదలయ్యాయి. ఇవ్వాళ సీఎం కెసిఆర్ నేతృత్వంలో మహిళలు స్వయంగా బ్యాంకులకు వెళుతున్నారు. ఆర్థిక లావాదేవీలు కూడా వారే నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఎదిగారు. ఆత్మ గౌరవం తో జీవిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి మహిళల చప్పట్ల మధ్య తెలిపారు.

గతంలో మహిళలకు డబ్బులు అవసరం ఉంటే భర్తలను బతిమిలాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పడు భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఇందులో స్త్రీనిధి, సీఎం కెసిఆర్ ల పాత్ర ఎంతో ఉంది. మహిళలకు డబ్బులు ఇస్తే ఎక్కడికీ పోదు. మహిళలు అప్పులు ఉంటే నిద్ర పోరు. ఎంత కష్టమైనా అప్పులు కడతారు. పొదుపు చేస్తారు. వాళ్ళు బతికి, నలుగురిని బతికిస్తారని మంత్రి దయాకర్ రావు చెప్పారు.

అప్పులివ్వాలంటే బ్యాంకు ల వాళ్ళు షూరిటీ అడుగుతారు. కానీ డ్వాక్రా మహిళలకు ఎలాంటి షూరిటీ లేకుండానే అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. కేవలం మహిళలను చూసి బ్యాంకులు ఇస్తున్నాయని మంత్రి తెలిపారు.

గతంలో ఉండే కష్టాల్లో ఇప్పుడు మహిళలు లేరు. గతంలో చుక్క నీరు లేదు. 24 గంటల కరెంటు లేదు. పరిశుభ్రత లేకుండే, ఇవ్వాళ పల్లె ప్రగతి తో గ్రామ వాతావరణం ఎంతో మారింది. చదువుల కోసం మాత్రమే పట్టణాలకు వెళుతున్నారు. మన ఊరు మన బడి ద్వారా 7 వేల కోట్లతో గ్రామాల బడులను సీఎం బాగు చేస్తున్నారు. విద్యను, వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యత గా తీసుకొని సీఎం కెసిఆర్ గారు అభివృద్ధి పరుస్తున్నారను మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

ప్రాజెక్టులు కట్టి గోదావరి, కృష్ణా నదుల నీటి ను నల్లాల ద్వారా నేరుగా ఇంటింటికీ ఇస్తున్న మహానుభావుడు సీఎం కెసిఆర్. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికుల కు, బోదెకాలు బాధితుల‌కు పెన్షన్లు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచే 57 ఏళ్లు నిండిన అర్హులైన‌ అందరికీ పెన్షన్లు వస్తాయని మంత్రి ప్రకటించారు.

గ్రామాల్లో అవసరాలు మీ ద్వారా తీరేట్లు చేయాలి. సీజనల్ వ్యాపారాలు కూడా చేయవచ్చు. ప్రతి వస్తువు మీరే  ఉత్పత్తి చేసి, అందరి అవసరాలు తీర్చి, ఆర్థికంగా మహిళలు ఎదగాలి. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలి. దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. మీరు మీ తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి మహిళలకు పిలుపిచ్చారు.

 అభయహస్తం నిధులను తిరిగి మహిళలకు ఇస్తాం. వాళ్లకు పెన్షన్లు కూడా అందజేస్తాం. స్త్రీ నిధి కమిటీ కాలాన్ని రెండేళ్లకు పెంచే యత్నం చేస్తాను. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక భవనాన్ని నిర్మింపచేస్తాను. సీఎం గారు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

స్త్రీనిధిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి సభ్యులందరూ కృషి చేయాలి. స్త్రీనిధి సేవలను పొంది, మీ ఆదాయాన్ని పెంచుకొని మరింత ఆర్థికాభివృద్దిని సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందు కొరకు నా నుండి, ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

ఈ సందర్భంగా స్త్రీ నిధి గత రెండేళ్లలో సాధించిన ప్రగతి నివేదికను సంస్థ కార్యదర్శి చదివి వినిపించారు. స్త్రీ నిధి సంస్థ కోసం పని చేస్తున్న పలువురిని మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, ఇతర అతిథులను స్త్రీనిధి సంస్థ ఘనంగా సత్కరించారు.

అలాగే స్త్రీ నిధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు ఉద్యోగులను, అధికారులను, సిబ్బందిని వివిధ కేట‌గిరీల వారీగా అవార్డులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్కరించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు.

More Press Releases