నీటిని పొదుపుగా వాడాలి.. భవిష్యత్తు తరాలకు అందించాలి: మంత్రి ఎర్రబెల్లి
- ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రపంచ జల దినోత్సవం ను పురస్కరించుకుని, మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నీటిని ఒడిసిపట్టడంలో, వినియోగించడంలో, పొదుపు చేయడంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం పూర్తిగా మిగతా రాష్ట్రాలకు, కేంద్రానికి విభిన్నం అన్నారు. సీఎం కేసీఆర్ ఒకవైపు నదీజలాల్లో వాటాను పూర్తిగా సద్వినియోగం చేస్తూ ప్రణాళికా బద్ధంగా బరాజ్‌లను, రిజర్వాయర్లను నిర్మిస్తూనే మరోవైపు నదుల పునరుజ్జీవనానికీ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల నాటి 27,785 గొలుసుకట్టు చెరువులు, కుంటలను బాగు చేసి, గ్రామాల్లో భూగర్భ నీటి మట్టం 4.35 మీటర్లు పెంపునకు దోహదం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గూడాలు, తండాలకు కూడా నల్లాల ద్వారా శుద్ధి చేసిన, స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తుండటం తెలంగాణకు గర్వకారణం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నీటి కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టిందని, పట్టణాల్లో మురుగునీరు చెరువులు, కుంటల్లో చేరకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను, పల్లెప్రగతి పేరిట పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంతోపాటు డంప్‌యార్డును ఏర్పాటు చేసి నీటి వనరులు కలుషితం కాకుండా చూస్తున్నది. తెలంగాణకు హరితహారం ఇందుకు ఊతమిస్తున్నది. మొక్కల పెంపకంతో పరోక్షంగా నేల కోతకు గురికాకుండా, నీటి వనరుల్లో పూడిక చేరకుండా నిరోధిస్తున్నది. నదుల్లో ఇసుక తొలగించకుండా ప్రభుత్వమే నియంత్రిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే నీటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నది. ఉపాధి హామీలో భాగంగా పొలాల్లో ఫామ్‌పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణకు అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలు, ప్రణాళికబద్ధ చర్యలపై నీటి నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్కోచ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) సంస్థల నుంచి జాతీయస్థాయి అవార్డులు అందుకుంటున్నదని మంత్రి న్నారు. ప్రతి ఒక్కరూ నీటి విలువ తెలుసుకుని, పొదుపుగా వినియోగించుకోవాలని, వృథా చేయరాదని, భవిష్యత్తు తరాలకుఅ అందే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.