క్రెడాయ్, ట్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 18: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో క్రెడాయ్, ట్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మరియు ఇతర సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత వాటాలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రెరా నియంత్రణ చర్యలు గురించి చర్చించారు. అవిభక్త విక్రయాలు మరియు ప్రీ లాంచ్ అమ్మకాలకు పాల్పడే వ్యక్తులు, కంపెనీలు మరియు డెవలపర్‌లపై రెరా నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియా ట్రాకింగ్ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. రెరా ఆమోదించిన ప్రాజెక్టులను మాత్రమే కొనుగోలు చేసి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే బిల్డర్ల నుండి మోసపోకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖల సమన్వయంతో క్రెడాయ్ ప్రత్యేక ప్రచారాన్ని చేపడుతుంది.
అవినీతికి పాల్పడుతున్న బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. అవిభక్త విక్రయాలు మరియు ప్రీ లాంచ్ అమ్మకాలను అరికట్టడానికి చర్యలను సూచించడానికి పట్టణ ప్రణాళిక, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మరియు క్రెడాయ్ ప్రతినిధులతో కూడిన నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పోలీస్ విభాగం అదనపు డీజీ, జితేందర్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, డీటీసీపీ విద్యాధర్, క్రెడాయ్, ట్రెడాయ్, టీబీఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.