గుంటతిప్ప డ్రెయిన్ మురుగునీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి: వీఎంసీ కమిషనర్ రంజిత్ భాషా
విజయవాడ: గుంటతిప్ప డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవుట వలన ఎదురవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రసాదంపాడు గ్రామస్తులు సోమవారం జరిగిన స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై కమిషనర్ పి.రంజిత్ భాషా స్పందిస్తూ, మంగళవారం ఉదయం అధికారులతో కలసి గుంటతిప్ప డ్రెయిన్ ను పరిశీలించారు. ఆటోనగర్ నుండి ప్రసాదంపాడు మీదుగా రైవస్ కాలువలో కలిసే సదరు గుంటతిప్ప డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవుట వల్ల సమస్య ఎదురవుతున్న దృష్ట్యా ఇటివల డ్రెయిన్ నందలి వ్యర్ధములు తొలగించి, సిల్ట్ తొలగించి డ్రెయిన్ నుండి దుర్వాసన రాకుండా, రేకులతో కప్పు ఏర్పాటు చేయుట జరిగిన విషయాన్ని అధికారులు కమిషనర్ కు వివరించారు.
బెల్లం వారి వీది నుండి శ్రీ శక్తి కళ్యాణమండపం వరకు సుమారు 2 కిలో.మీ పొడవున గల గుంటతిప్ప డ్రెయిన్ నందలి మురుగునీటి ప్రవాహాన్ని కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, డ్రెయిన్ నందు మురుగునీటి పారుదలకు అవరోధంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను ఎప్పటికప్పడు తొలగించాలని అన్నారు. ప్రసాదంపాడు ప్రాంతములో ఇటీవల ఏర్పాటు చేసిన గ్రేట్టింగ్ వద్ద తరచూ చెత్త మరియు వ్యర్దములు అడ్డుపడుట వల్ల మురుగునీటి ప్రవాహం సక్రమముగా జరగక పరిసర ప్రాంతములోని లోతట్టు ప్రదేశాలలో మురుగునీరు చేరి స్థానిక నివాసాల వారికీ ఇబ్బందికరంగా ఉంటున్న విషయాన్ని గమనించి సదరు గ్రేటింగ్ వద్ద ఏవిధమైన చెత్త నిల్వలు పేరుకుపోకుండా వాటిని ఎప్పటికప్పడు తొలగించేలా పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాబాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.